కరోనా నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తాజా సీజన్ నిర్వహణ కోసం బీసీసీఐ ముప్పుతిప్పలు పడుతూ మూడు చెరువుల నీళ్లు తాగుతోంది. ఇప్పటికే ఇండియా నుంచి దుబాయ్‌కు టోర్నీ మార్చిన బీసీసీఐకు ఇప్పుడు మరో కష్టం వచ్చి పడింది. తాజాగా ఐపీఎల్ మ్యాచ్‌లకు అంపైర్లు దొరకని పరిస్థితి ఏర్పడింది. ఈ నెల 19 నుంచి ఓ వైపు ఐపీఎల్ ప్రారంభం కానుంది. మరోవైపు ఈ రోజు షెడ్యూల్ రిలీజ్ అవుతుందని అంటున్నారు.
ఇలాంటి టైంలో ఐపీఎల్లో అంపైరింగ్ చేసేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఎలైట్ ప్యానెల్‌కు చెందిన అంపైర్లు సుముఖంగా లేరు. ఈ మ్యాచ్‌లకు అంపైరింగ్ చేయాలని ఐసీపీ ఎలైట్ ప్యానెల్ సభ్యులను బీసీసీఐ కోరగా కేవలం నలుగురు మాత్రమే ఓకే చెప్పారట. మిగిలిన అంపైర్లు కరోనా భయంతో ఒప్పుకోలేదట. ఓకే చెప్పిన అంపైర్లలో క్రిస్ గఫాని (న్యూజిలాండ్), రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ (ఇంగ్లండ్), మైకేల్ గాఫ్ (ఇంగ్లండ్)తో పాటు భారత్‌కు చెందిన నితిన్ మీనన్ ఉన్నారు.
వీరు వ్యక్తిగత కారణాలు అని పైకి చెపుతున్నా… లోపల మాత్రం వీరు కరోనా భయంతో అంపైరింగ్ చేసేందుకు ఎంత మాత్రం ఇష్టపడడం లేదంటున్నారు. ఏ మాత్రం బయటకు వెళ్లకుండా దాదాపు రెండు నెలల పాటు సాగే ఐపీఎల్‌లో బాధ్యతలు నిర్వర్తించడం అవసరమా అనే అభిప్రాయానికి వారు వచ్చినట్లు సమాచారం. దీంతో టోర్నీ నిర్వహణలో ఏం చేయాలో తెలియక బీసీసీఐ మరో కొత్త చిక్కు వచ్చి పడింది. ఇక స్థానిక అంపైర్లు మాత్రమే ఇప్పుడు అందుబాటులో ఉంటారు.