ఆమె ఓ ఐఏఎస్ అధికారిణి.. మన తెలుగుమ్మాయే హైదరాబాద్ వాసి. 2013 బ్యాచ్ ఐఏఎస్ అయిన ఆమె అస్సాంలో చచర్ జిల్లాలో డిప్యూటీ కమిషనర్‌గా పని చేస్తున్నారు. అయితే ఆమె పని చేస్తోన్న జిల్లాలో కోవిడ్ తీవ్రత ఎక్కువుగా ఉన్న నేపథ్యంలో ఆమె తన విధులకు సెలవు పెట్టకుండానే పెళ్లి చేసుకున్నారు. ఆమె నిర్ణయంపై దేశ్యాప్తంగా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్‌కు చెందిన కీర్తి జల్లి 2013లో ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. ఆమెకు పూణేకు చెందిన వ్యాపారవేత్త ఆదిత్య శశికాంత్‌తో పెళ్లి జరిగింది.
అయితే కీర్తి విధులు నిర్వహిస్తోన్న అస్సాంలోని చచర్ జిల్లా హైలకండిలో ప్రస్తుతం రోజుకు 100 వరకు కోవిడ్ కేసులు బయటపడుతున్నాయి. అది బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉంది. ఈ టైంలో ఆమె విధులు వదిలేసి హైదరాబాద్‌కు వెళ్లడం ఆమెకు ఇష్టం లేదు. దీంతో వరుడు కుటుంబం కూడా ఆమెకు సపోర్ట్ చేసింది. వరుడు బంధువులు ముందే సిల్సార్ వెళ్లి అక్కడ హోం క్వారంటైన్ పూర్తి చేశాకే బుధవారం కీర్తి బంగ్లాలోనే ఆమెకు తాళికట్టాడు. కేవలం కర్నాటక సంగీతం వినిపిస్తుండగానే ఈ పెళ్లి తంతు పూర్తయ్యింది.
వరుడు తరపున ఓ 20 మంది బంధువులు, కీర్తి సోదరి మాత్రమే ఈ పెళ్లికి వెళ్లారు. కీర్తి తల్లిదండ్రులకు కూడా కోవిడ్ పాజిటివ్ రావడంతో వారు కూడా పెళ్లికి వెళ్లలేదు. ఈ పెళ్లి జూమ్ వీడియో యాప్ ద్వారా 800 మంది చూశారు. పెళ్లి రోజు బుధవారం కూడా ఆమె ఫోన్లో విధులు నిర్వహించారు. దీంతో ఆమెకు దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో ప్రశంసలు వ్యక్తం అవుతున్నాయి.