బాలీవుడ్ హీరోయిన్, ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ శివసేన వివాదాస్పద ఎంపీ సంజయ్‌రౌత్‌పై తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. సంజయ్ రౌత్ పురుష అహంకారి అని ఆమె తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. ఇలాంటి వారి వల్లే భారతీయ మహిళలపై అత్యాచారాలు, లైంగీక దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు. తాను మహారాష్ట్ర వాసిని కాదన్న రౌత్ వ్యాఖ్యలను ఖండిస్తున్నానని చెప్పిన ఆమె గతంలో ముంబై మహా నగరంలో బతకలేకపోతున్నామని చెప్పిన ఆమిర్ ఖాన్, నసీరుద్దీన్ షాపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని కంగనా ప్రశ్నించారు. తాను ఒక మహిళను అయినందువల్లే సంజయ్ రెచ్చిపోతున్నారా ? అని ఫైర్ అయ్యారు.
సెప్టెంబర్ 9 న ముంబై వస్తున్నానని, దమ్ముంటే తనను అడ్డుకోవాలని ఆమె విమర్శకులకు సవాల్ విసిరిన ఆమె ప్రస్తుతం సిమ్లాలో ఉన్నారు. ఇక సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ కేసు విచారిస్తోన్న ముంబై పోలీసులపై తనకు నమ్మకం లేదని ఆమె అసహనం వ్యక్తం చేసినప్పటి నుంచి వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. తనకు ముంబై పాక్ ఆక్రమిత కశ్మీర్‌లా కనిపిస్తోందని కంగనా కామెంట్ చేయడంతో వివాదం మరింత ముదిరింది. ఇదిలాఉంటే కంగనాకు వై కేటగిరి భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఓకే చెప్పింది.