సరిహద్దుల్లో తరచూ ఉద్రిక్తతలు క్రియేట్ చేస్తూ భారత్‌ను కవ్విస్తోన్న చైనా మరోసారి దుస్సాహాసానికి దిగింది. తాజాగా తూర్పు లద్దాఖ్‌లో ప్యాంగాంగ్ సరస్సు సరిహద్దుల్లో భారత దళాలకు గాలిలో కాల్పులు జరిపి దుస్సాహాసానికి తెగబడింది. 1975 నాటి ఘర్షణల తర్వాత చైనా సరిహద్దుల్లో కాల్పులు జరగడం ఇదే ప్రథమం. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్‌ఏ) దళాలు గాలిలో కాల్పులు జరిపాయని, సరిహద్దుల్లోని భారత్ పోస్ట్‌ను స్వాధీనం చేసుకునేందుకు ఇవి విఫలయత్నం చేశాయని భారత సైన్యం ప్రకటన చేసింది.
ఇక భారత – చైనాల మధ్య కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందాన్ని చైనా పదే పదే ఉల్లంఘిస్తోందని కూడా భారత సైన్యం స్పష్టం చేసింది. భారతీయ సైనికులను భయపెట్టేందుకు చైనా దళం ముందుగా రెండు రౌండ్ల పాటు గాలిలో కాల్పులు జరిపింది. ఆ వెంటనే భారత సైన్యం ప్రతిఘటించడంతో చైనా సైన్యం తోక ముడవక తప్పలేదు. అయితే ఈ కాల్పులపై చైనా సైతం స్పందించింది. భారత సైన్యం వాస్తవాధీన రేఖను దాటి వచ్చి, చర్చల కోసం ముందుకు వస్తున్న చైనా సరిహద్దు గస్తీ దళాలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాయని ఆరోపించింది.
ఇదిలా ఉంటే భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతలు కాల్పుల స్థాయికి చేరడం ఆందోళనకరమని విశ్లేషకులు భావిస్తున్నారు. సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం ఉండకూడదని రెండు దేశాల రక్షణ మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, జనరల్ వీ ఫెంగ్ నిర్ణయించిన మూడు రోజులకే ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి. ఇక ఆగస్టు 29 ప్యాగాంగ్ సరస్సు దక్షిణ భాగంలో భారత భూభాగాన్ని చైనా స్వాధీనం చేసుకునేందుకు కూడా ఉద్రిక్తతలు తీవ్రమైన సంగతి తెలిసిందే.