టాలీవుడ్‌లో దివంగత ధర్మవరపు సుబ్రహ్మణ్యం కామెడీకి చాలా స్పెషాలిటీ ఉంది. ఆయన కామెడీ టైమింగ్, ఆయన వేసే పంచ్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన కామెడీ టైమింగే ఆయన్ను మిగిలిన కమెడియన్లతో పోలిస్తే ప్రత్యేకంగా నిలబెట్టింది. ధర్మవరపు సుబ్రహ్మణ్యం ముందుగా బుల్లితెరపై పాపులర్ అయ్యి తానేంటో ఫ్రూవ్ చేసుకున్నాక వెండితెరపై సత్తా చాటాడు.
ప్రకాశం జిల్లాకు చెందిన ఆయన చిన్నప్పటి నుంచే సినిమాలపై ఆసక్తి పెంచుకున్నారు. సినిమాల్లో నటించాలని ఆయన మద్రాస్ పారిపోయారు. అక్కడ అవకాశాలు రాకపోవడంతో తిరిగి ఇంటికి వచ్చేశారు. చిన్నప్పటి నుంచి చదువులో ముందుండే ఆయన పబ్లిక్ సర్వీష్ కమిషన్ పరీక్షలు రాసి పంచాయతీ రాజ్ ఉద్యోగం సాధించారు. అయితే ఆయనలో ఉన్న నటనను ఆయన ఎప్పుడూ మర్చిపోలేదు.
బుల్లితెరతో కెరీర్ ప్రారంభించి.. అక్కడ సక్సెస్ అయ్యాక వెండితెరపై తిరుగులేని కమెడియన్ అవ్వడంతో పాటు ఎన్నో అవార్డులు, రివార్డులు సాధించారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్ రెడ్డితో చాలా సన్నిహితంగా ఉండేవారు. ఇక ఆయనకు ఇద్దరు కుమారులు. వారికి సినిమా రంగంపై ఆసక్తి లేకపోవడంతో వ్యాపార రంగంలో రాణిస్తూ స్థిరపడిపోయారు.