ఏపీ మంత్రి కొడాలి నానిపై తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో టీడీపీ నేత దేవినేని ఉమ ఫిర్యాదు చేశారు. కొద్ది రోజులుగా నాని మాజీ సీఎం చంద్రబాబుతో పాటు టీడీపీకి చెందిన మాజీ మంత్రి దేవినేని ఉమాపై తీవ్రస్థాయిలో విరుచుకు పడుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నాని లారీతో తొక్కించి మరీ చంపేస్తామని కూడా బెదిరిస్తోన్నారని ఉమా తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కొడాలి నానితో పాటు వల్లభనేని వంశీ, వసంత కృష్ణప్రసాద్ లపై కూడా ఫిర్యాదు చేశారు.
అనంతరం దేవినేని ఉమా మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ ప్రేరణతోనే నాని, వంశీ, కృష్ణ ప్రసాద్ బెదిరిస్తున్నారంటూ చెప్పారు. ఇక లారీతో తొక్కి చంపేస్తానని ఒక మంత్రి అనడం దారుణమని అన్నారు. ఇలాంటి మాటలు రాజ్యాంగ ఉల్లంఘన కిందకు రావా ? అని కూడా ప్రశ్నించారు. మంత్రి నానిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఉమా డిమాండ్ చేశారు.
మరో టీడీపీ నేత బచ్చుల అర్జునుడు మాట్లాడుతూ, చంద్రబాబు, దేవినేని ఉమలపై కొడాలి నాని అనుచిత వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. ఇక రాష్ట్రంలో రాజ్యాంగం కాకుండా రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోందన్నారు. ఇక ప్రశ్నించేవారిపైనే దాడులకు పాల్పడుతున్నారని.. భవిష్యత్తులో జగన్ అరాచక పాలనపై ప్రజలు తిరగబడే రోజు దగ్గర్లోనే ఉందని అర్జనుడు అన్నారు. ఏదేమైనా కొడాలి నాని, వంశీ, కృష్ణ ప్రసాద్‌లపై టీడీపీ నేతలు కూడా ప్రతి విమర్శలు చేస్తుండడంతో కృష్ణా రాజకీయం హీటెక్కుతోంది.