కరోనా రాజకీయ నాయకులను వదలడం లేదు. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎంతో మంది ప్రజా ప్రతినిధులు కోవిడ్ భారీన పడుతున్నారు. తాజాగా ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కరోనాకు గురయ్యారు. ఈ విషయాన్ని ఆయన తన స్వయంగా తన ట్విట్టర్‌లో వెల్లడించారు. ఆయనకు స్వల్ప జ్వరంగా ఉండడంతో కరోనా పరీక్షలు చేయించుకున్నారు. దీంతో ఆయనకు కోవిడ్ ఉన్నట్టు తేలింది. మీ ఆశీర్వాదాలతో తాను త్వరలోనే కోలుకుంటానని ఆయన ట్వీట్‌లో కోరారు.
ఇక సోమవారం ఢిల్లీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరిగింది. సిసోడియాకు జ్వరం రావడంతో ఆయన ఈ సమావేశానికి దూరంగా ఉన్నారు. మార్చి 23న ఢిల్లీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశం కేవలం ఒక్క రోజు మాత్రమే నిర్వహించారు. ఆ తర్వాత కరోనా తీవ్రత నేపథ్యంలో మళ్లీ సోమవారం ఒక్క రోజు మాత్రమే ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఢిల్లీలో ఇప్పటి వరకూ కరోనా కేసుల సంఖ్య 2.21 లక్షలు దాటింది. ఇందులో 1.88 లక్షల మంది కోలుకోగా… 4770 మంది చనిపోయారు.