ఎన్డీయే ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులపై వ్యతిరేకత క్రమంగా పెరుగుతోంది. ఈ బిల్లును అనేక పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికే ఎన్డీయే మిత్రపక్షం శిరోమణి అకాలీదళ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయడంతో పాటు ఆ పార్టీ ఎంపీ హర్‌సిమ్రత్ కౌర్ తన కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు పలు ఉత్తరాది పార్టీలు కూడా ఈ బాటలోనే నడవనున్నాయి. హర్యానాలో బీజేపీ ప్రభుత్వంలో ఉన్న జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) ఎన్డీయే నుంచి వైదొలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
జేజేపీ చీఫ్ దుశ్యంత్ సింగ్ చౌతాలా ప్రస్తుతం హర్యానా డిప్యూటీ సీఎంగా ఉన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా పనిచేస్తోందని.. ఇప్పటికే అకాళీదళ్ ఎన్డీయే నుంచి వైదొలగిన నేపథ్యంలో ఇప్పుడు చౌతలాపై కూడా ఒత్తిడి పెరుగుతోంది. దీంతో ఈ పార్టీ బీజేపీతో కలిసి కొనసాగడంపై తన నిర్ణయం సమీక్షించుకునే అవకాశం ఉందంటున్నారు. మాజీ ఉప ప్రధాని, దేవీలాల్‌కు రైతు బాంధవుడిగా మంచి గుర్తింపు ఉందని, దుశ్యంత్ ఆయన వారసత్వాన్ని కొనసాగించాలని పలువురు నేతలు కోరుతున్నారు.
ఇదిలా ఉంటే 90 స్థానాలు ఉన్న హరియాణ అసెంబ్లీలో ఖట్టర్ నేతృత్వంలోని బీజేపీ 40 స్థానాలు సాధించి.. అతిపెద్ద పార్టీగా అవతరించినా మేజిక్ ఫిగర్ 46 రాలేదు. దీంతో 10 స్థానాలు సాధించిన దుష్యంత్ చౌతాలా కింగ్‌మేకర్ అయ్యారు. దీంతో జేజేపీ మద్దతుతో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఇప్పుడు ప్రభుత్వం నుంచి జేజేపీ వైదొలగితే బీజేపీ ప్రభుత్వం కుప్పకూలడం ఖాయంగానే కనిపిస్తోంది.