టాలీవుడ్ టాప్ హీరో అక్కినేని నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ నాలుగో సీజన్ షో ప్రారంభమైంది. ఇక షోపై గతంలో ఎన్నో విమర్శలు వచ్చాయి. తాజాగా సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ బిగ్‌బాస్ షోపై మండిపడ్డారు. ఈ షోతో హిమాలయాల్లో ఉన్న మన భారతీయ సంస్కృతిని తీసుకువచ్చి ఆ మురికి కుంటలో పడేసినట్లుందని ఎద్దేవా చేశారు. విజయ్ మాల్యా విలాస భవనాలను మించేలా బిగ్‌బాస్ హౌస్ ఉందని నారాయణ విమర్శించారు.
యువతీ, యువకులను ఇక్కడకు తీసుకువచ్చి వంద రోజులు ఇందులోనే పెడతారట.. నాగార్జున ఓ యువకుడిని ( అభిజిత్) ని పిలిచి ముగ్గురు అమ్మాయిలు ( హీరోయిన్లు) ఫొటోలు చూపించి.. వారిలో ఎవరిని ముద్దు పెట్టుకుంటావు ? ఎవరితో డేట్‌కు వెళతావు ? ఎవరిని పెళ్లి చేసుకుంటావు ? అని అడుగుతున్నాడు ? ఇదేనా యువతీ యువకులకు మీరు ఇచ్చే సందేశం అని నారాయణ నాగార్జునపై సెటైర్ వేశాడు.
ఇక యువతీ యువకులను కలిపి 100 రోజుల పాటు ప్రపంచంతో సంబంధం లేకుండా చేయడమే చాలా తప్పు అని.. మీరు కళామతల్లికి అన్యాయం చేయడంతో పాటు అవమానిస్తున్నారని.. కోట్ల మంది ప్రజలను టీవీల ముందు కూర్చో పెడుతూ సాంస్కృతిక దోపిడీ చేస్తున్నారు… ఇలాంటి అనైతిక షోలను ప్రజలు ఆదరించవద్దని నారాయణ కోరారు.