విశాఖలో దళిత యువకుడు శ్రీకాంత్‌కు శిరోముండనం చేసిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న నూతన్ నాయుడు పరారీలో ఉండగా పోలీసులు కర్నాటకలోని ఉడిపి పోలీస్‌స్టేషన్లో అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ నూతన్ నాయుడి గురించి మరిన్ని లీలలు వెలుగులోకి వస్తున్నాయి. ఇద్దరికి బ్యాంకు ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి ఏకంగా రూ.12 కోట్లకు టోకరా వేయడంపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విశాఖపట్నం జిల్లా రావికమతంకు చెందిన నూకరాజు, తెలంగాణలోని చేవెళ్లకు చెందిన శ్రీకాంత్‌రెడ్డి బెస్ట్ ఫ్రెండ్స్.
వీరికి నూతన్ నాయుడుతో పరిచయం ఏర్పడి స్నేహం కుదిరింది. ఈ క్రమంలోనే వీరికి నూతన్ ఎస్‌బీఐలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించాడు. ఆ బ్యాంకులో దక్షిణ భారత రీజియన్ డైరెక్టర్ పోస్టు కోసం శ్రీకాంత్‌రెడ్డి రూ.12 కోట్లు, ఉద్యోగం కోసం నూకరాజు రూ.5 లక్షలు చెల్లించారు. వీరు డబ్బులు ఇచ్చి రెండేళ్లు అయినా వీరికి ఉద్యోగాలు రాలేదు. దీంతో తాము మోసపోయాం అని గ్రహించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అయితే పోలీసులు శ్రీకాంత్ రెడ్డికి రు. 12 కోట్లు ఇచ్చేంత స్థోమత ఉందా ? అన్న దాంతో పాటు ఇటు నూతన్ నాయుడిపై వచ్చిన ఫిర్యాదుపై కూడా విచారణ చేస్తున్నారు. నూతన్‌నాయుడుకి సహకరించిన శశికాంత్ అనే వ్యక్తిపై కూడా కేసు నమోదు చేశామని చెప్పారు. ఇప్పటికే శిరోముండనం కేసులో అరెస్టై జైల్లో ఉన్న నూతన్‌నాయుడిని కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు. ఇప్పుడు నూతన్‌పై మోసం కేసు కూడా నమోదు కానుంది.