బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసు దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపుతోంది. ఈ కేసులో రోజుకో కొత్త ట్విస్ట్ బయటకు వస్తోంది. ఇక ఈ కేసులో ప్రాంతీయ వాదం, కులవాదం కూడా తెరపైకి వస్తున్నాయి. బీజేపీ ఎన్నికల్లో భారతీయుడు అయిన సుశాంత్‌ను బిహార్ నటుడిగా ప్రచారం చేసి లబ్ధి పొందాలని చూస్తోందని కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి విమర్శలు గుప్పించారు. సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తి పట్ల దర్యాప్తు సంస్థల తీరు సరిగా లేదన్న ఆయన రియా బెంగాలీ బ్రాహ్మణ వర్గానికి చెందిన మహిళ అంటూ వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది.
సుశాంత్ విషయంలో దర్యాప్తు సంస్థలు పొలిటికల్ మాస్టర్ల మెప్పు పొందేలా తమ పాత్ర పోషించాయని చౌదరి విమర్శించారు. అసలైన హంతకుడి కోసం కేంద్ర సంస్థలు వెతుకుతూనే ఉన్నాయని వ్యగ్యంగా ట్వీట్ చేశారు. ఇక రియా తండ్రి దేశానికి సేవ చేసిన మాజీ ఆర్మీ అధికారి అని కూడా ఆయన చెప్పారు. సుశాంత్ కేసులో మీడియా విచారణ సైతం న్యాయ వ్యవస్థకు అరిష్టంగా మారిందని ఆయన అన్నారు.
ఇక బిహారీ అయిన సుశాంత్ సింగ్ (రాజ్‌పుత్)కు న్యాయం జరగాలన్నది బీజేపీ వాదన అయితే, బెంగాలీ బ్రాహ్మణ మహిళ అయిన రియాకు న్యాయం జరగాలన్న ధోరణిలో అధీర్ మాట్లాడడం చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారం రాజకీయ కుల ప్రాంతీయ రంగు పులుముకుందన్న విమర్శలు సోషల్ మీడియాలో వస్తున్నాయి.