ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఏపీ రాజధాని అమరావతి ప్రాంత రైతులు బహిరంగ లేఖ రాశారు. రాజధాని రైతులపై రాష్ట్ర ప్రభుత్వం వేధింపులు ఆపేలా చర్యలు తీసుకోవాలని… అమరావతిని కాపాడేలా పార్లమెంట్లో ప్రకటన చేయాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. ఇక రాజధానిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ పెద్ద ఎత్తున రైతులను టార్గెట్ చేసే కుట్ర జరుగుతోందని.. కుటుంబ అవసరాల కోసం భూములు అమ్మినా కూడా సిట్, సీఐడి, సబ్ కమిటీ పేర్లతో వేధింపులకు గురిచేస్తున్నారని వారు వాపోయారు.
ప్రభుత్వం రైతులతో న్యాయబద్ధంగా చేసుకున్న ఒప్పందం గౌరవించడం లేదని… కనీసం అమరావతి హద్దులు తెలియకుండానే నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని వారు లేఖలో వాపోయారు. అమరావతిపై ఆక్రోశం వెళ్లగక్కే నాయకులతో సబ్ కమిటీ ఏర్పాటు చేసి రాజధానిపై బురద చల్లుతున్నారని.. పేద రైతుల పిల్లల చదువులు, పెళ్లిళ్ల కోసం జరిపిన విక్రయాలు కూడా ఇన్ సైడ్ ట్రేడింగేనా..? అని వారు ప్రశ్నించారు.
ఇక కడపలో ముఖ్యమంత్రి కుమార్తె పేరిట కొన్న భూములు కూడా ఇన్ సైడ్ ట్రేడింగానే భావించాలా..? అని సీఎం జగన్‌ను వారు సూటిగా ప్రశ్నించేలా లేఖలో పేర్కొన్నారు. పేదలకు ఇళ్ల స్థలాల మాటున రాష్ట్రంలో పెద్దఎత్తున వన్ సైడ్ ట్రేడింగ్ జరుగుతోందని.. ఈ భారీ కుంభకోణం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే అమరావతిలో తమపై అవినీతి ముద్ర వేస్తున్నారంటూ రాజధాని ప్రాంతానికి చెందిన రైతులు, మహిళలు లేఖలో పేర్కొన్నారు.