సమాజంలో రోజు రోజుకు మహిళలపై లైంగీక దాడులు, అత్యాచారాలు, వేధింపులు ఎక్కువ అవుతున్నాయి. ఒంటరిగా ఉన్న మహిళలు లేదా ఇబ్బందుల్లో ఉన్న మహిళలను టార్గెట్‌గా చేసుకుని కామాంధులు చేసే వికృత చర్యలు, ఆగడాలకు అంతే లేకుండా పోతోంది. మొన్న ఓ యువతి తనపై ఏకంగా 139 మంది అత్యాచారం చేశారంటూ ఫిర్యాదు చేసిన ఘటన మర్చిపోకముందే ఇప్పుడు తెలంగాణలోనే నిజామాబాద్‌లో ఓ మహిళపై ఏకంగా 12 మంది యువకులు సామూహిక లైంగీక దాడికి పాల్పడ్డారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోనే సోమవారం అర్ధరాత్రి జరిగిన ఈ దారుణ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. పోలీసులు చెపుతోన్న దాని ప్రకారం ఎడపల్లి మండల కేంద్రానికి చెందిన ఓ మహిళ రెండ్రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడింది. గాయపడిన ఆ మహిళను ఆమె సోదరి నిజామాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించింది. అనంతరం ఆమె పని నిమిత్తం రైల్వేస్టేషన్ సమీపంలోకి వెళ్లగా అక్కడ విక్కీ అనే యువకుడు ఆమెతో మాటలు కలిపాడు.
డబ్బులు అవసరం ఉందని ఆమె చెప్పగా ఆమెను నమ్మించి కలెక్టరేట్ పక్కన ఉన్న ధర్నా చౌక్ ప్రాంతానికి తీసుకువెళ్లాడు. ఇంతలోనే అక్కడకు విక్కీ స్నేహితులు మరో 11 మంది వచ్చారు. వీరంతా కలిసి ఆ మహిళపై ఒకరు తర్వాత ఒకరు దారుణంగా అఘాయత్యానికి పాల్పడ్డారు. అక్కడ రెవెన్యూ భవన్‌కు సమీపంలో ఉన్న ఖాళీ గదిలో ఈ లైంగీక దాడి జరిగింది. అంతలోనే అక్కడకు పోలీస్ పెట్రోలింగ్ సిబ్బంది రావడంతో యువకులు పరారయ్యారు.
అర్ధరాత్రి వేళ ఆ స్థితిలో ఉన్న మహిళను పోలీసులు ప్రశ్నించారు. వెంటనే ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. నిందితులు నగరంలో హమాల్‌వాడీకి చెందిన యువకులని పోలీసులు తెలిపారు. నిందితుల కోసం పోలీసుల వేట కొనసాగుతోంది.