మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య సినిమా నాలుగు రోజుల వ్యవధిలోనూ రెండు ఆరోపణలను ఎదుర్కోవాల్సి వచ్చింది. తాజాగా రిలీజ్ అయిన ఆచార్య మోషన్ పోస్టర్ తన కథ నుంచే కాపీ చేశారని రచయిత కన్నెగంటి అనిల్‌కృష్ణ ఆరోపించారు. తాను పుణ్యభూమి టైటిల్‌తో 2006లోనే ఓ కథను రచయితల సంఘంలో రిజిస్ట్రేషన్ చేయించానని.. ఇక మోషన్ పోస్టర్‌లో ధర్మస్థలి అనేది తన కథ నుంచే కాపీ కొట్టారని అనిల్ ఆరోపిస్తున్నాడు.
ఇదిలా ఉండగా ఆచార్య సినిమా కథ నాదే అంటూ రాజేష్ మండూరి అనే రచయిత సుదీర్ఘమైన ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు. స్టార్ డైరెక్టర్ బి.గోపాల్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన రాజేష్ తాను గతంలో రాసుకున్న కథను అద్దంకి నియోజకవర్గ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ సాయంతో రెండేళ్ల క్రితమే మైత్రీ మూవీమేకర్స్ వారికి వినిపించానని చెపుతున్నాడు. ముందు తాను ఈ కథను ఎమ్మెల్యే రవికుమార్‌కు చెప్పానని. ఆ తర్వాత ఆయన సహకారంతో స్టోరీ అంతా మైత్రీ మూవీ మేకర్స్ కో ప్రొడ్యుసర్ చెర్రీకి వినిపిస్తే ఈ స్టోరీ పెద్ద ఫిలిం మేకర్స్ చేస్తే బాగుంటుంది.. ఈ కథను ఇవ్వమని వాళ్లు అడిగితే తాను ఒప్పుకోలేదని రాజేష్ చెప్పాడు.
ఇప్పుడు అదే లైన్‌తో కొరటాల శివ చిరంజీవితో ఆచార్య చేస్తున్నట్టు తెలియడంతో తాను ఆవేదన చెందానని.. మైత్రీ మూవీ మేకర్స్ ద్వారా ఈ కథ కొరటాల శివకు వెళ్లి ఉంటుందని కూడా ఆరోపిస్తున్నాడు. అంతేకాకుండా ఈ సినిమాను ఓ తమిళ్ నిర్మాతకు చెప్పానని.. బాలకృష్ణ హీరోగా ఈ సినిమాను తెరకెక్కించాలని అనుకున్నామని కూడా రాజేష్ చెపుతున్నాడు. దీనిపై తాను ఎమ్మెల్యే రవి, పరుచూరి గోపాలకృష్ణలను సంప్రదించి.. ఆ తర్వాత తెలుగు రచయితల సంఘానికి కంప్లెంట్ చేస్తే వారు కూడా లీగల్‌గా వెళ్లాలని సూచించారని రాజేష్ చెపుతున్నాడు.
మరి ఇప్పుడు రాజేష్ చెప్పినట్టు ఈ సినిమాను మైత్రీ మూవీ వాళ్లు నిర్మించడం లేదు. ఈ వివాదం ఎలా మలుపులు తిరుగుతుందో ? చూడాలి. గతంలో కొరటాల శ్రీమంతుడు సినిమాపై సైతం కాపీ మరకలు వచ్చిన సంగతి తెలిసిందే.