ఏపీ ప్రభుత్వం భూముల రేట్లను మరోసారి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో ఉన్న భూముల మార్కెట్ విలువ పెరుగుదలకు అనుగుణంగానే రిజిస్ట్రేషన్ విలువ పెంపునకు కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇక కొత్తగా భూముల విలువను 5 నుంచి 50 శాతం వరకు పెంచారు. ఇక కొత్తగా రాజధాని ప్రాంతంగా ఏర్పడిన విశాఖలో అయితే భూముల విలువకు రెక్కలు వచ్చేశాయి. ఇక్కడ రేట్లు మామూలుగా పెరగలేదు. భీమిలి లాంటి ఖరీదైన ప్రాంతాల్లో అయితే ఏకంగా 50 శాతం భూముల విలువ పెంచేశారు.
విశాఖ పరిపాలనా రాజధాని ప్రకటన వచ్చిందో లేదో ఇక్కడ భూముల రేట్లు మామూలుగా పెరగలేదు. ఇక కొత్త భూముల రేట్ల పెంపునకు సంబంధించి త్వరలో మార్గదర్శకాలు కూడా విడుదల కానున్నాయి. ఒక్క పూరి గుడిసెకు మినహా అన్ని కట్టడాలు, నిర్మాణాలు, చివరకు ఫౌల్ట్రీ షెడ్డుల మార్కెట్ విలువ సైతం అనూహ్యంగా పెరిగింది. ఇక తాజ మార్కెట్ విలువ పెంపుతో విశాఖలో ఖరీదైన మధురవాడ కెజీహెచ్ కాలనీలో గజం ధర రూ.18100 ఉండగా దానిని 5 శాతం పెంపుతో రూ.19వేలకు వెళ్లింది. గజం రు. 19 వేలు అంటే ఒక సెంటు ఖరీదు ఏకంగా 9,12,000 కు చేరుకుంది.
ఇక నగరంలోనే మరో కీలక ప్రాంతమైన పీఎంపాలెం ఎస్సీ కాలనీలో 8 శాతం వరకు భూముల విలువ పెంచారు. ఇక రామాలయం వీధిలో 20 శాతం పరదేశీపాలెంలో 22 శాతం ఆనందపురం పెందుర్తి మార్గంలోని పలు ప్రాంతాల్లో 5 శాతం నుండి 13 శాతం పెంచుతున్నారు. ఇక పర్యాటకంగా మంచి ప్రాంతమైన రిషికొండ బీచ్ ప్రాంతాల్లో గజం మార్కెట్ విలువ ఏకంగా రు. 25 వేలకు చేరుకుంది. ఇక భీమిలిలో వ్యవసాయ భూముల రేట్లు అయితే ఏకంగా రు. 2 కోట్ల నుంచి రు. 3 కోట్లకు పెంచారు. ఇక వీటి అమలు ఆగస్టు 10వ తేదీ నుంచి ఉంటుంది.. ఎవరికి అయినా అభ్యంతరాలు ఉంటే ఈ లోగా తెలియజేయాలి.