ప్రపంచ మహమ్మారి కరోనా వైరస్ ఎంతలా విజృంభిస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు తీవ్రంగా పెరిగి పోతున్నాయి. ఇక ఏపీలో కరోనా చాపకింద నీరులా విజృంభిస్తోంది. ముఖ్యంగా రాజధాని కేంద్రమైన విజయవాడలో కరోనా వ్యాప్తి గురించి ఓ భయంకర నిజం బయటకు వచ్చింది. విజయవాడ నగర పరిసర ప్రాంతాల్లో నిర్వహించిన వివిధ రకాల వైరస్ పరీక్షల విశ్లేషణలో దాదాపు 40 శాతం మందికి అసలు వారికి కరోనా సోకినట్టు తెలియకుండానే కరోనా సోకుతోందట.
నగరంలో కరోనా ఇన్‌ఫెక్షన్ రేటు ఏ స్థాయిలో ఉందో తెలుసుకునేందుకు అధికారులు చేయించిన సర్వేలో ఈ భయంకర నిజం వెల్లడైందట. ఇందుకోసమే ఇటీవల నగరంలో అధికారులు సిరో సర్వైలైన్స్ సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో జిల్లా వ్యాప్తంగా 20 శాతం మందికి కరోనా సోకిన విషయం కాని తగ్గిన విషయం కాని తెలియడం లేదట. అయితే ఆ తర్వాత వీరి రక్త నమూనాల పరిశీలనలో మాత్రం వీరికి కరోనా సోకిన ఆనవాళ్లు గుర్తిస్తున్నారు.
విజయవాడ అర్బన్ లో 378 మందికి కరోనా యాంటీ బాడీలు ఉన్నట్లు గుర్తించారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో మే నెలాఖరు వరకు నమోదైన కరోనా కేసులను పరిగణనలోకి తీసుకుని ఈ పరీక్షలు చేసినట్లు తెలిపారు. అయితే ఇది ఆరోగ్యంగా ఉన్న వారికంటే ఏదో ఒక అనారోగ్యంతో ఉన్నవారికి తీవ్రమైన ఇబ్బంది అవుతుంది. మనిషికి తెలియకుండానే ప్రాణాలు పోతాయట. ఈ పరిస్థితి యువకుల్లో కూడా ఉంటుందట. దీనిని బట్టి విజయవాడ వాసులు బయటకు వచ్చేటప్పుడు మరిన్ని జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం చూసిస్తోంది.