కోవిడ్కు-19 నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సుదీర్ఘకాలం పాటు కొనసాగుతున్న లాక్ డౌన్ ను క్రమంగా సడలిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అన్‌లాక్ 3.0 మార్గదర్శకాలను కేంద్ర హోంశాఖ జారీచేసింది. ఇందులో భాగంగా ఆగస్టు 5వ తేదీ నుంచి యోగ కేంద్రాలు, జిమ్ సెంటర్లు తెరిచేందుకు అనుమతులు వచ్చాయి. ఈ కొత్త నిబంధన లో భాగంగా కంటోన్మెంట్ ప్రాంతంలో ఉన్న జిమ్‌లు, యోగా కేంద్రాలను మూసి ఉంచాలని… కంటోన్మెంట్ కేంద్రాలకు బయట ఉన్న వాటిని మాత్రమే తెరిచి ఉంచేందుకు అనుమతించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఇక 65 ఏళ్ల వయస్సు ఉన్నవారు… అనారోగ్య సమస్యలు ఉన్నవారు గర్భిణీలు, పదేళ్ల వయస్సు లోపు పిల్లలను జిమ్, యోగా కేంద్రాల్లోకి అనుమతించరు. ఇక్కడ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఆరు అడుగుల దూరం పాటించడంతో పాటు తప్పనిసరిగా ఫేస్ గార్డ్స్, మాస్క్‌లు ధరించాలి.
సబ్బుతో చేతులు కడుక్కోవటం.. ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్ తో చేతులు శుభ్రంగా కడగడం చేయాలి. దగ్గు, జలుబు వచ్చినప్పుడు టిష్యూ లేదా చేతి రుమాలుతో మోచేతిని అడ్డుగా పెట్టుకోవాలని సూచించారు. ఇక ప్రతి ఒక్కరూ మాస్క్ ఉపయోగించటం తప్పనిసరి అని ప్రకటించారు.
వ్యాయామం చేసేటప్పుడు ప్రతి వ్యక్తికి మధ్య నాలుగు చదరపు మీటర్ల దూరంతో పాటు.. జిమ్‌లోని ఫిట్నెస్ సామాగ్రి కూడా నాలుగు నుంచి ఆరు అడుగుల దూరం ఉండేలా చర్యలు తీసుకోవాలి. ఉష్ణోగ్రత 24 – 30 డిగ్రీల మధ్యలో ఉండేలా చూడాలి.
యోగా శిక్షణలో పాల్గొనే వారి సంఖ్య ఆధారంగా శిక్షణ తరగతులు ఉండాలని… ప్రతి శిక్షణ తరగతుల మధ్య 15 నుంచి 30 నిమిషాల వ్యవధి ఉండాలని సూచించారు. ఈ నిబంధనల్లో ఏవీ పాటించకపోయినా వీటిని మూసి వేయడం జరుగుతుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.