అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఈ సంవత్సరం అస్సలు కలిసి రావడం లేదు. అమెరికా ఓ వైపు కరోనాతో విలవిల్లాడుతుండడం.. మరోవైపు అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవడం ఆయన్ను ఇబ్బంది పెడుతుంటే తాజాగా ఆయన ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ట్రంప్ తమ్ముడు, రాబర్ట్ ట్రంప్ మృతి చెందారు. రాబర్ట్ గత కొన్నేళ్లుగా కుటుంబానికి దూరంగా ఉంటున్నారు. న్యూయార్క్‌లో శనివారం రాత్రి ఆయన మృతిచెందారు. ఈ విషయాన్ని ట్రంప్ స్వయంగా ప్రకటించారు.
కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన ఆరోగ్యం విషమించడంతో మృతి చెందారు. సోదరుడి మృతిపై ట్రంప్ మాట్లాడుతూ నా ప్రియమైన సోదరుడు రాబర్ట్ ఈ రాత్రి మృతి చెందినట్టు చెపుతున్నానని చెప్పారు. రాబర్ట్ తన సోదరుడు మాత్రమే కాదని.. గొప్ప వ్యక్తని చెప్పిన ట్రంప్ సోదరుడి జ్ఞాపకాలు తనతో ఎప్పుడూ ఉంటాయని పేర్కొన్నారు. రాబర్ట్, ఐ లవ్ యు. విశ్రాంతి తీసుకోండని తన సందేశంలో చెప్పారు. ట్రంప్ కంటే ఆయన మూడేళ్ళు చిన్న వాడు.