తెలంగాణలో మరో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్ వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. దేశవ్యాప్తంగా కరోనా విలయతాండవం కొనసాగుతోంది. తాజా లెక్కలతో దేశంలో కరోనా కేసులు 17 లక్షలు దాటేశాయి. నిన్న ఒక్క రోజే ఏకంగా 52 వేల కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా ఎంతలా విజృంభిస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక కరోనా సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎవ్వరిని వదలడం లేదు.
కరోనా దెబ్బతో మంత్రులు, మాజీ మంత్రులు సైతం చనిపోతోన్న సంగతి తెలిసిందే. ఆదివారం యూపీ విద్యాశాఖా మంత్రి కమలారాణితో పాటు ఏపీ మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు సైతం మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇక తెలంగాణలో ఇప్పటికే అధికార టీఆర్ఎస్‌కు చెందిన పలువురు ఎమ్మెల్యేలకు కరోనా సోకింది. ఈ క్రమంలోనే మరో ఎమ్మెల్సీతో పాటు ఎమ్మెల్యేకు కూడా కరోనా వచ్చినట్టు సమాచారం.
ఇప్పటికే విప్ గొంగిడి సునీత, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్థన్, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి కరోనా పాజిటివ్ రాగా తాజాగా ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావుతో పాటు రంగారెడ్డి జిల్లా పఠాన్ చెరుకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి కరోనా పాజిటివ్ వచ్చినట్లుగా సమాచారం అందుతోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఏదేమైనా సామాన్య ప్రజలే కాకుండా ప్రజాప్రతినిధులు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.