హీరోయిన్లలో రెండు, మూడు పెళ్లిళ్లు చేసుకున్న వారు చాలా మందే ఉన్నారు. ఇక పాత తరం హీరోయిన్లలో పాత తరం కథానాయిక లక్ష్మి, జయంతి, రాధిక… ఇలా వీరంతా మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. ఇక సీనియర్ నటి జయంతి ఎన్టీఆర్ సరసన ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించారు. జయంతి నటన ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆర్టిస్టుగా ఆమె జీవితం ఎంత గొప్పగా ఉన్నా ఆమె వ్యక్తిగత, వైవాహిక జీవితాలు మాత్రం ఆమెకు చేదు అనుభవాలనే మిగిల్చాయి. ఆమె మూడు పెళ్లిళ్లు చేసుకున్నా మూడు పెటాకులే అయ్యాయి.
ఆమె ముందుగా నటిగా రాణిస్తూ ఉండగానే నటుడు, దర్శకుడు పేకేటి శివరాంను పెళ్లాడారు. జయంతి అసలు పేరు కమలకుమారి. కమలకుమారిగా ఉన్న ఆమె పేరును జయంతిగా మార్చింది శివరాం. లవకుశ సినిమాలో సీత పక్కన ఉండే చెల్లెల్లో ఒకరిగా జయంతి కనిపించారు. తర్వాత జగదేకవీరుని కథ సినిమాలో నలుగురు హీరోయిన్లలో ఆమె కూడా ఒకరు. ఇలా చిన్న చిన్న పాత్రలు వేసుకుంటోన్న కమలకుమారి శివరాంను ఆకర్షించారు. తర్వాత ఆయన దయతోనే ఆమె పలు సినిమాల్లో హీరోయిన్ పాత్రలు సొంతం చేసుకున్నారు.
ఈ క్రమంలోనే జయంతి తల్లి సంతానలక్ష్మిని ఒప్పించేసి ఆమెను పెళ్లాడారు. అప్పటికే శివరాంకు పెళ్లయ్యి పిల్లలు కూడా ఉన్నారు. ఈ దంపతులకు ఓ కొడుకు పుట్టాక వీరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయారు. ఆ తర్వాత జయంతి చందన చిత్ర నిర్మాత బండారు గిరిబాబును పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులిద్దరికి ఇది రెండో పెళ్లే.. ఆ తర్వాత ఆయనతోనూ ఆమె విడిపోయారు.
ఇక చివరిగా ఆమె తనకంటే 25 ఏళ్లు చిన్నవాడు అయిన కన్నడ హీరో రాజశేఖర్‌ను పెళ్లి చేసుకున్నారు. రాజశేఖర్‌ను హీరోగా నిలబెట్టేందుకు ఆమె చేసిన ప్రయత్నాలు అన్ని విఫలమయ్యాయి. ఆ తర్వాత ఈ వివాహం కూడా మూడునాళ్ల ముచ్చటే అయ్యింది. అలా జయంతి మూడు పెళ్లిళ్లు ఫెయిల్ అయ్యాయి.