తూర్పు గోదావరి జిల్లాలో కాళ్ల పారాణి ఆరకముందే.. పెళ్లి అయిన రెండు రోజులకే ఓ నవ వధువు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నవవధువు ఆత్మహత్య పెద్ద సంచలనంగా మారింది. అటు పెళ్లికుమార్తె కుటుంబంతో పాటు పెళ్లి కుమారుడు కుటుంబంలోనూ ఇది పెద్ద విషాదమైంది. అయితే ఈ షార్ట్ ఫిల్మ్ హీరోయిన్ ఆత్మహత్య కేసులో కొన్ని సంచలన నిజాలు బయటకు వస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం ఏడిద సీతానగరం గ్రామానికి చెందిన రమ్య శ్రీ ( 20) కి షార్ట్ ఫిల్మ్‌లలో నటించడం అంటే ఇష్టం. ఈమె తల్లిదండ్రులు మహాదాసు శ్రీను, మంగ.
డిగ్రీ చదువుతోన్న రమ్య శ్రీ ( 20)కు మూడు రోజుల క్రితమే పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం లక్ష్మణేశ్వరం గ్రామానికి చెందిన ఆమె మేనమామతో పెళ్లి జరిపించారు. అయితే మేనమామతో పెళ్లి రమ్య శ్రీకి ఇష్టం లేకపోయినా తల్లిదండ్రులు బలవంతంగా చేసేశారన్న ఆరోపణలు ఉన్నాయి. పెళ్లయ్యాక మూడు రోజులకే పుట్టింటికి వెళ్లిన ఆమె అక్కడ ఎలుకల మందు తినేసింది. పరిస్థితి విషమించడంతో ఆమెను ఆసుపత్రికి తీసుకు వెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది.
ఈ మృతిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేయగా అనేక షాకింగ్ విషయాలు తెలిశాయి. రమ్య శ్రీకి షార్ట్ ఫిలింస్ అంటే ఇష్టమని.. ఆమె ఇటీవల ఓ షార్ట్ ఫిల్మ్‌లో నటించగా అది ఈ నెల 2వ తేదీన రిలీజ్ చేసేందుకు కూడా సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం. ఆమె మరిన్ని షార్ట్ ఫిల్మ్‌లోల నటించాలన్న కోరికతో ఉంది. అయితే తల్లిదండ్రులు పెళ్లి చేసేయడంతో తన కోరిక తీరదని.. ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసుల విచారణలో తేలింది.