ఈ ఏడాది శబరిమల యాత్రకు భక్తులను అనుమతిచ్చేందుకు కేరళ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఓ వైపు కరోనా విలయ తాంవడం చేస్తుండడంతో కొన్ని నిబంధనలు పాటిస్తూ ఈ సారి యాత్రకు అనుమతులు ఇస్తున్నట్టు కేరళ దేవాదాయ శాఖా మంత్రి కదకంపల్లి సురేంద్రన్ వెల్లడించారు. నవంబర్ 16న యాత్ర ప్రారంభమవుతుందని, స్వామి దర్శనానికి వచ్చే భక్తులు తమకు కరోనా లేదని నిరూపించే కొవిడ్-19 సర్టిఫికెట్ ను తప్పనిసరిగా ఇక్కడ సమర్పించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.
ఇక కరోనా పరీక్షలు కూడా కేవలం ఐసీఎంఆర్ గుర్తింపు పొందిన ల్యాబుల్లో మాత్రమే చేయించుకోవాలని… భక్తులు అందరికి స్క్రీనింగ్ చేసి లోపలకు పంపుతామన్నారు. పంబ, నీలక్కల్ మధ్య తిరిగే బస్సుల్లోనూ భౌతికదూరాన్ని తప్పనిసరి చేస్తామని తెలిపారు. అలాగే విపత్తు నిర్వహణల్లో భాగంగా హెలికాఫ్టర్ ను అందుబాటులోకి ఉంచనున్నట్లు సమాచారం.