శ్రీశైలం ఎడమగట్టు ఫైర్ ప్రమాదంలో 9 మంది చనిపోయారు. ఈ ప్రమాద ఘటన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను తీవ్రంగా కలిచి వేసింది. ఇక ఈ ఘటనపై తెలంగాణలో రాజకీయ రంగు పులుముకుంది. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న టీ కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి తాజాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు. శ్రీశైలంలో జరిగిన ఘటనకు కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని రేవంత్ తన లేఖలో ఆరోపించారు. ప్రమాద సంకేతాలపై ముందుగానే సిబ్బంది లేఖ రాసినా కూడా ఉన్నతాధికారులు సకాలంలో స్పందించలేదని రేవంత్ పేర్కొన్నారు.
ఇక శ్రీశైలం డ్యాం భద్రతతో పాటు అక్కడ విద్యుత్ ప్లాంట్ నిర్వహణ లోపాలపై ఎన్నో యేళ్లుగా ఆందోళనలు వ్యక్తం అవుతున్నా కూడా ప్రభుత్వం ఆ అభ్యంతరాలను ఎప్పుడూ పట్టించుకోలేదని.. అందుకే ఈ రోజు అక్కడ ప్రమాదం జరిగి ఏకంగా 9 మంది ప్రాణాలు పోయాయని రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే తొమ్మిది మంది ప్రాణాలు పోవడంతో పాటు వేల కోట్ల జాతి సంపద నాశనం అయ్యిందని.. దీనిపై నిస్పాక్షికంగా విచారణ చేయాలని కూడా రేవంత్ మోదీని కోరారు. ఇక బాధిత కుటుంబాలకు రూ. కోటి సాయం ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించండని కోరారు.