ఉత్తరాంధ్రలో టీడీపీకి అత్యంత బలమైన సపోర్ట్ ఇచ్చేది కింజరాపు ఫ్యామిలీనే. దశాబ్దాల తరబడి శ్రీకాకుళం జిల్లా టీడీపీలో కీలక పాత్ర పోషించేది కింజరాపు కుటుంబమే. దివంగత ఎర్రన్నాయుడు చాలా ఏళ్ళు టీడీపీకి పెద్ద దిక్కుగా వ్యవహరించారు. ఇక ఆయన మరణంతో అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడులు శ్రీకాకుళంలో పార్టీ బాధ్యతలని చూసుకుంటున్నారు. అయితే సడన్‌గా ఈఎస్‌ఐ స్కామ్‌లో అచ్చెన్న అరెస్ట్ కావడంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. రామ్మోహన్ నాయుడు సైతం బాబాయ్‌ని బయటకు తీసుకొచ్చే పనిమీద దృష్టి పెట్టడంతో జిల్లాలో టీడీపీకి కాస్త కష్టాల్లో పడిపోయింది. అయితే అచ్చెన్న అరెస్ట్ అయ్యి రెండు నెలలు అవుతుంది. ఇప్పటివరకు బెయిల్ రాలేదు. ఇప్పటిలో బెయిల్ కూడా వచ్చేలా కనిపించడం లేదు. దీంతో రామ్మోహన్ రాజకీయంగా సరికొత్త నిర్ణయం తీసుకుబోతున్నారంటూ ప్రచారం మొదలైంది.
ఆయన టీడీపీని వీడి బీజేపీలో చేరుతున్నారంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. అసలు టీడీపీ అధిష్టానం ఏ మాత్రం కింజరాపు ఫ్యామిలీని పట్టించుకోవడం లేదని, అందుకే రామ్మోహన్ తన దారి తాను చూసుకుంటున్నారంటూ ప్రచారం జరుగుతోంది. తన బాబాయ్‌ని బయటకు తీసుకురావలనే షరతుతో రామ్మోహన్ బీజేపీలోకి వెళుతున్నారని పుకార్లు షికారు చేస్తున్నాయి. అటు బీజేపీ ఎలాగో రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసే పనిలో పడింది. ఈ క్రమంలోనే ఉత్తరాంధ్రలో బాగా బలంగా ఉన్న రామ్మోహన్ నాయుడు లాంటి యువనాయకుడుని పార్టీలో చేర్చుకుంటే తిరుగుండదని భావిస్తున్నారట.
అయితే ఇదంతా ప్రచారమే అని టీడీపీ వర్గాలు కొట్టిపారేస్తున్నాయి. చంద్రబాబుకు వీర విధేయులుగా ఉండే కింజరాపు ఫ్యామిలీ టీడీపీని వీడటమనేది జరగని పని అని చెబుతున్నారు. ఇదంతా కొన్ని వ్యతిరేక వర్గాలు చేస్తున్న ప్రచారమని, రామ్మోహన్ నాయుడు బీజేపీలోకి వెళ్లడమనేది జరగదని అంటున్నారు. అయినా అచ్చెన్న అరెస్ట్‌పై టీడీపీ అధిష్టానం నిరంతరం పోరాడుతూనే ఉందని, చంద్రబాబు కింజరాపు కుటుంబానికి ఎప్పుడు అండగానే ఉంటున్నారని, ఎవరో గిట్టని వారు మాత్రమే రామ్మోహన్ పార్టీ మారుతున్నారని ప్రచారం చేస్తున్నారని తమ్ముళ్ళు ఫైర్ అవుతున్నారు. రామ్మోహన్ ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారేందుకు రెడీగా లేరని తమ్ముళ్ళు చెబుతున్నారు.