ఏపీలో మూడు రాజధానులపై ముందు నుంచి వేచి చూసే ధోరణితోనే ఉన్న బీజేపీ తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ మూడు రాజధానుల అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసిన సోము వీర్రాజుకు అభినందనలు తెలియజేసిన ఆయన పలు అంశాలపై మాట్లాడారు. ఏపీలో కన్నాను తొలగించి వీర్రాజును అధ్యక్షులుగా నియమించామనే వాదన సరికాదన్నారు. కన్నా కూడా భవిష్యత్తులో మరో బాధ్యత తీసుకుని పని చేస్తారని… 2024లో ఏపీలో బీజేపీ అధికారంలోకి వస్తుందని.. ఈ విషయం తాము అషామాషీగా చెప్పడం లేదని ఆయన తెలిపారు.
ఇక ఏపీలో ఖాళీ అయిన ప్రతిపక్ష స్తానాన్ని బీజేపీ భర్తీ చేస్తోందని… వచ్చే నాలుగేళ్లలో బలమైన శక్తి గా బిజెపి ఎదుగుతుంది.. అందుకు కార్యాచరణ కూడా సిద్దమైందని ఆయన తెలిపారు. ఇక మూడు రాజధానుల ప్రభుత్వం నిర్ణయాన్ని గవర్నర్ ఆమోదించారని.. కేంద్రం జోక్యం చేసుకోవాలనే డిమాండ్ లు వస్తున్నాయన్నారు. చంద్రబాబు అమరావతి రాజధానిగా ప్రకటిస్తే కేంద్రం అభ్యంతరం చెప్పలేదని.. ఇప్పుడు మూడు రాజధానులు అంటే… కేంద్రం జోక్యం చాలా పరిమితంగా ఉంటుందని రామ్ మాధవ్ చెప్పారు.
ఒక రాజధాని నిర్మాణంలో అవినీతిని బిజెపి ప్రశ్నించిందని.. మళ్లీ మూడు రాజధానుల పేరుతో అవినీతి చేస్తే బిజెపి పోరాడుతుందని.. ఈ విషయంలో వెనక్కి తగ్గమని ఆయన వార్నింగ్ ఇచ్చారు. అయితే అమరావతి రైతులు, ప్రజలకు పూర్తి గా న్యాయం చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పై ఉందని కూడా ఆయన కుండబద్దలు కొట్టారు. ప్రస్తుతం కోర్ట్ పరిధిలో ఉన్నందున తీర్పు వచ్చే వరకు ఎదురు చూడాలని… ప్రత్యర్ధులు పోటీ చేయకుండా పోలీసులు ను ఇంటికి పంపి బెదిరించిన వైనం ఏపీలోనే చూశామని ఆయన విరుచుకు పడ్డారు. ఏదేమైనా ఏపీలో వైసీపీ విషయంలో బీజేపీ అదనుచూసి ఎత్తులు, పై ఎత్తులు వేసేందుకు అయితే రెడీగానే ఉంది.