తెలంగాణ బీజేపీలో పెద్ద ముసలం మొదలు అయ్యింది. తాజాగా తెలంగాణ బీజేపీ రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కమిటీలో కేవలం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అనుచరులకు మాత్రమే చోటు దక్కిందని మిగిలిన వర్గాల నేతలు ఆరోపిస్తున్నారు. ఇక మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్ వర్గానికి పదవులు దక్కలేదంటూ ఆ వర్గం నేతలు అప్పుడే ఆరోపణలు చేస్తున్నారు. ఈ ముసలం ఇలా ఉండగానే ఇప్పుడు తెలంగాణలో ఆ పార్టీకి చెందిన ఒకే ఒక ఎమ్మెల్యే రాజా సింగ్ కొత్త కమిటీ ఏర్పాటుపై భగ్గుమన్నారు.
తెలంగాణలో పార్టీకి మిగిలిన ఒక్క ఎమ్మెల్యే అయిన తనను కొత్త కమిటీ ఏర్పాటులో ఎంత మాత్రం సంప్రదించలేదని ఆయన ఫైర్ అయ్యారు. నియోజకవర్గంలో తన విజయం కోసం కార్యకర్తలు ఏకంగా రెండు సార్లు కష్టపడ్డారని.. అలాంటిది తన నియోజకవర్గంలో ఒక్క నేతకు కూడా కొత్త కమిటీలో చోటు ఇవ్వలేదని రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు తన అసంతృప్తిని నేరుగా రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్‌కు వాట్సాప్ మెసేజ్ చేశారు. తాను బీజేపీకి ఏకైక ఎమ్మెల్యేగా ఉండడంతో పాటు ఫ్లోర్ లీడర్‌గా ఉన్నా తన అభిప్రాయాన్ని ఎందుకు పట్టించుకోలేదని రాజాసింగ్ తీవ్ర అసహనాన్ని తన మెసేజ్లో వ్యక్తం చేశారు.
ఇక కొత్త కమిటీ ఎంపికలో అన్ని ప్రాంతాలకు న్యాయం జరగలేదని.. కొన్ని ప్రాంతాలు.. కొన్ని వర్గాల వారికే పదవులు కట్టబెట్టారని ఆరోపణలు వస్తోన్న సంగతి తెలిసిందే. దీనికి తోడు ఇప్పటికే లక్ష్మణ్ వర్గాన్ని పక్కన పెట్టారన్న టాక్‌కు తోడు ఇప్పుడు ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా ఆరోపణలు చేస్తుండడడంతో టీ బీజేపీలో ఈ వార్ ఎటు వైపు దారి తీస్తుందో ? అన్న చర్చలు నడుస్తున్నాయి.