కరోనా దెబ్బతో దాదాపు ఐదు నెలలుగా దేశవ్యాప్తంగా మెట్రో రైళ్లు ఆగిపోయాయి. ఇక అన్‌లాక్ 4.0లో భాగంగా వచ్చే నెల 7వ తేదీ నుంచి మెట్రో రైళ్లు పట్టాలు ఎక్కనున్నాయి. దేశరాజధాని న్యూ ఢిల్లీ ప్రస్తుతం కోవిడ్ కేసుల పరంగా నాలుగో స్థానంలో ఉంది. అలాంటి చోట ఇప్పుడు మెట్రో సర్వీసులు తిరిగి ప్రారంభిస్తే అది ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో అన్న ఆందోళనలు తీవ్రంగా ఉన్నాయి. మెట్రో రీ ఓపెన్ చేయకపోతే పరిస్థితి రోజు రోజుకు తీవ్రంగా మారుతోంది.
ఈ క్రమంలోనే ఓ వైపు కరోనా కట్టడి చేస్తూనే మరోవైపు మెట్రో సర్వీసులు పునః ప్రారంభించక తప్పని పరిస్థితి. అయితే ఇందుకు కొన్ని కఠిన నియమాలు తీసుకుంటూ మెట్రో సర్వీసులను ప్రారంభిస్తామని ఢిల్లీ రవాణా శాఖ మంత్రి కైలాష్ గహ్లోత్ తెలిపారు. సామాజిక దూరం, థర్మల్ స్క్రీనింగ్, మాస్కులు ధరించడం తప్పనిసరి చేశామని ఆదివారం మీడియాకు చెప్పారు. ఇక ప్రయాణికులకు టోకెన్స్ జారీ చేయకుండా థర్మల్ స్క్రీనింగ్ చేసిన వెంటనే లోపలకు అనుమతి ఇస్తారు.
ఇక ఫేమెంట్లు కూడా కేవలం స్మార్ట్ కార్డులు, డిజిటల్ విధానంలో మాత్రమే ఉండేలా చూస్తున్నారు. ఇక లిఫ్టుల్లో కూడా చాలా పరిమిత సంఖ్యలోనే ప్రయాణికులు వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఇందుకు తగినట్టుగా మెట్రో స్టేషన్లలో రైలు నిలిచే సమయం కూడా పెంచనున్నారు. ఇక కోవిడ్ కారణంగా మార్చిలోనే మెట్రో సర్వీసులను నిలిపివేశారు. దీంతో రు. 1300 కోట్లు నష్టం వాటిల్లింది. ఇక మెట్రో పునః ప్రారంభంపై సీఎం కేజ్రీవాల్ హర్షం వ్యక్తం చేశారు.