గత కొద్ది రోజులుగా టాలీవుడ్లో సూపర్‌స్టార్ మహేష్‌బాబు, స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తోంది. ఈ సంక్రాంతికి వచ్చిన ఈ ఇద్దరు హీరోల సినిమాలు అల వైకుంఠపురంలో, సరిలేరు నీకెవ్వరు సినిమాల మధ్య ఎంత పోటీ నడిచిందో తెలిసిందే. సినిమా రిలీజ్డేట్ల నుంచి… థియేటర్ల వరకు ప్రతి విషయంలోనూ పోటాపోటీగా ముందుకు వెళ్లారు. ఎవ్వరూ వెనక్కు తగ్గలేదు. చివరకు ఇద్దరు హీరోల సినిమాలు హిట్ అయినా బన్నీ అల సినిమా కాస్త పైచేయి సాధించింది.
ఈ పోటీలో ఎవ్వరు వెనక్కి తగ్గలేదు… రిలీజ్డేట్ల విషయంలో రెండు, మూడు పంచాయతీలు ఫెయిల్ అయ్యాక జరిగిన పరిణామాల నేపథ్యంలో మహేష్ మాత్రం వెనక్కు తగ్గకుండా ముందుకు వెళ్లారన్న టాక్ వినిపించింది. ఇక ఇప్పుడు మహేష్ మరోసారి బన్నీతో పోటీకి సై అంటే సై అంటున్నాడట. బన్నీ పుష్ప ఐదు భాషల్లో రిలీజ్ అవుతోంది. ఇప్పటికే రాక్‌స్టార్ దేవిశ్రీ రెడీ చేసిన ఆల్బమ్ పూర్తయ్యిందంటున్నారు. ఇక మహేష్ కూడా తన సర్కారు వారి పాట ఆల్బమ్ త్వరగా రెడీ చేయాలని సంగీత దర్శకుడు థమన్, ఈ సినిమా డైరెక్టర్ పరశురాంకు సూచించినట్టు తెలుస్తోంది.
పుష్ప సినిమాకు పోటీగానే తన సినిమాను తీసుకు రావాలని మహేష్ ఈ సారి కూడా పట్టుదలతో ఉన్నాడట. పుష్ప సంక్రాంతికి వచ్చేలా ప్లాన్ చేస్తున్నా ఇది సమ్మర్‌కు వెళ్లేలా ఉంది. ఇప్పుడు మహేష్ సైతం తన సినిమాకు బన్నీ సినిమాకు పోటీగానే దింపే ప్లాన్‌లో ఉన్నాడట. అందుకే ఆల్బమ్ త్వరగా రెడీ చేయమని ఆదేశించాడంటున్నారు. ఇది గమనించిన ఇండస్ట్రీ వర్గాలు మరోసారి బన్నీతో పోటీకి మహేష్ సై అంటున్నాడని చర్చించుకుంటున్నారు.