హైదరాబాద్‌లో ఓ మహిళపై ఏకంగా 139 మంది రేప్ చేశారంటూ నమోదు అయిన కేసులో పలువురు సెలబ్రిటీల పేర్లు బయటకు వస్తున్నాయి. మిర్యాలగూడకు చెందిన ఓ యువతి తనపై 139 మంది ఏకంగా 5 వేల సార్లకు పైగా అత్యాచారం చేశారని.. పలుసార్లు తనకు అబార్షన్ చేయించారని ఆ యువతి పంజాగుట్ట పోలీస్‌స్టేషన్లో కేసు పెట్టడం.. ఈ కేసు కోసం ప్రత్యేకంగా ఓ ఏసీపీని కూడా నియమించడం తెలిసిందే. ఇక ఈ 139 మందిలో యాంకర్ ప్రదీప్ మాచిరాజుతో పాటు నటుడు కృష్ణుడు కూడా ఉన్నాడని.. పలువురు రాజకీయ నేతలు, మీడియా వాళ్లు, విద్యార్థి సంఘాల నేతలు ఉన్నారని కూడా ఆమె ఆరోపించారు.
తనపై కొన్నేళ్లుగా ఈ అత్యాచారాలు జరుగుతున్నాయని చెప్పడం ఆసక్తిగా మారింది. ఇక ఈ కేసులో కృష్ణుడు కూడా ఉన్నాడని బాధితురాలు చేసిన ఆరోపణలపై కృష్ణుడు స్పందించాడు. ఆమె పెట్టిన కేసును తన ఫాల్స్ కేసుగానే భావిస్తానని.. తెలంగాణలో షీ టీమ్స్‌తో పోలీసుల నిరంతర నిఘా ఉన్న సమయంలో చదువుకున్న అమ్మాయికి అన్యాయం జరుగుతుందంటే తాను నమ్మనని కృష్ణుడు అన్నాడు. అమెకు నిజంగా అన్యాయం జరిగి ఉంటే 100 ఫోన్ చేసి ఉంటే పోలీసులు స్పందించేవారని చెప్పారు.
ఈ కేసులో సినిమా, రాజకీయ నాయకుల పేర్లు ఇరికిస్తే కేసు తీవ్రత పెరుగుతుందన్న ఉద్దేశంతోనే ఆమె ఇలా చేసి ఉండొచ్చన్న సందేహం కృష్ణుడు వ్యక్తం చేశాడు. ఇలాంటి ఆరోపణల వల్ల తనతో పాటు తన కుటుంబ సభ్యులు ఎంతో క్షోభ అనుభవించారని ఆయన తెలిపాడు. నాలుగు నెలల క్రితం నల్లగొండ నుంచి ఓ మహిళ ఫోన్ చేసి తాను మీ అభిమానిని అని చెప్పిందని.. అప్పుడే అనుమానంతో తాను ఆ నెంబర్‌ను బ్లాక్ చేశానని చెప్పాడు.