కరోనా కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ ( ఐపీఎల్) ఇప్పటికే యూఏఈకి తరలింది. అయితే ఇప్పుడు ఐపీఎల్ 2020 నిర్వహణపై కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంటోంది. ఐపీఎల్‌ను రెండంచెల్లో జరపాలని బీసీసీఐ భావిస్తోంది. కరోనా యూఏఈలో తక్కువుగా ఉన్నా అక్కడ నిబంధనలను సవరిస్తూ లీగ్ జరపడం పెద్ద సవాల్‌గానే ఉందట. అందుకే ఇప్పటి వరకు షెడ్యూల్ కూడా రిలీజ్ చేయలేదంటున్నారు. ఐపీఎల్ అక్కడ జరగాలంటే యూఏఈలోని దుబాయ్, షార్జా, అబుదాబి నగరాల మధ్య మ్యాచ్‌ల కోసం జర్నీ చేయాల్సి ఉంది. ఈ మూడు నగరాల్లోనూ కోవిడ్ నిబంధనలు ఉన్నాయి.
ఉదాహరణకు ఎవరైనా అబుదాబీలో అడుగు పెట్టాలంటే ర్యాపిడ్ టెస్టుల్లో పాల్గొని నెగిటివ్ వస్తేనే సరిహద్దు దాటాలన్న నిబంధన ఉంది. ఇలా మ్యాచ్ మ్యాచ్‌కు వేదిక మారేటప్పుడు టెస్టులు అంటే సాధ్యం కాదు. అందుకే తొలి అంచెను అబుదాబీతో పోలిస్తే దుబాయ్, షార్జాలలో నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. రెండో అంచెను అబూదాబీలో జరపాలని చూస్తున్నారు. ఇక ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లను దుబాయ్, అబుదాబీల్లో, నవంబర్ 10న జరిగే ఫైనల్‌ను దుబాయ్‌లో జరిగేలా ప్లాన్ చేస్తున్నారు. మొత్తం 56 మ్యాచ్‌ల్లో దుబాయ్‌లో 21, అబుదాబిలో 21, షార్జాలో 14 జరిగే అవకాశాలున్నాయి.