సమాజంలో రోజు రోజుకు మానవ విలువలు మంట కలుస్తున్నాయి. ఇక కుల రక్కసి ఈ రోజుకి కూడా చాలా మందిలో కనిపిస్తోంది. తమ అమ్మాయి తక్కువ కులానికి చెందిన అబ్బాయిని ప్రేమించకూడదు.. తమ కులం అమ్మాయి తమ కులం వాడినే పెళ్లి చేసుకోవాలంటూ ఇలా రకరకాల జాడ్యాలు ఈ రోజుకి చాలా చోట్ల ఉన్నాయి. సమాజం ఎంత అభివృద్ధి చెందుతున్నా ఇవి మాత్రం చీడలాగానే పట్టి పీడిస్తున్నాయి. ఈ క్రమంలోనే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది.
ఓ మహిళ వేరే కులానికి చెందిన వ్యక్తిని ప్రేమించిందని ఆమె కమ్యూనిటీకి చెందిన కొందరు ఆమెపై గ్యాంగ్ రేప్ చేశారు. బెంగాల్లో ఓ మారుమూల గిరిజన గ్రామానికి చెందిన మహిళ తన ప్రియుడితో కలిసి బైక్‌పై వెళుతోంది. ఈ క్రమంలోనే ఆమె కమ్యూనిటీకి చెందిన కొందరు వ్యక్తులు వీరిని చూశారు. వారిని అక్కడికక్కడే ఆపి ఆ మహిళను, ఆమె ప్రియుడిని అక్కడే బంధించారు. అక్కడ ఓ కమ్యూనిటీ క్లబ్‌లోకి బలవంతంగా లాక్కెల్లి బంధించి, కొట్టారని ఆ గిరిజన యువతి పోలీసు ఫిర్యాదులో పేర్కొంది.
బెంగాల్లోని బీర్భం జిల్లాలో ఈ ఘటన జరిగింది. అయితే దీనిపై స్థానిక ప్రజా కోర్ట్ లో విచారణ జరగగా ఆ మహిళకు రు. 10 వేలు, ఆమె ప్రియుడికి రు. 50 వేలు జరిమానా విధించారు. ఆ మహిళ గిరిజనేతరుడితో సహజీవనం చేసిందనే ఈ సంఘటన జరిగిందని పోలీసులు చెపుతున్నారు. ప్రస్తుతం పోలీసులు ఈ సంఘటనపై కూలంకషంగా విచారణ జరుపుతున్నారు.