తెలంగాణ పోలీసులను కరోనా పట్టి పీడిస్తోంది. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు పోలీసులు ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా ముందుండి మరీ పోరాడుతున్నారు. తెలంగాణలో కరోనా ప్రారంభమైనప్పటి నుంచి పోలీసులు ఎంత మాత్రం లెక్క చేయకుండా బయటకు వస్తూ ప్రజలను కట్టడి చేస్తూ తమ ప్రాణాలు పణంగా పెట్టి మరీ పోరాటం చేస్తున్నారు. ఇక ఇప్పటి వరకు తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 21 మంది పోలీసులు మృతి చెందారు. దీంతో పోలీసులకు ప్రభుత్వం నుంచి సరైన వైద్య సహకారం అందడం లేదన్న విమర్శలతో వీరిలో రోజు రోజుకు ఆత్మస్థైర్యం సన్నగిల్లుతోన్న పరిస్థితి.
ఇక మిగిలిన తెలంగాణ ఎలా ఉన్నా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే పరిస్థితి మాత్రం మరింత ఘోరంగా ఉంది. ఇప్పటి వరకు ఇక్కడే ఏఎస్సైలే ఏకంగా ఆరుగురు వరకు మృతి చెందారు. బాచుపల్లి పోలీస్‌స్టేషన్లో పనిచేస్తోన్న యూసఫ్ కూడా మృతి చెందారు. తెలంగాణలో కరోనా సోకి చనిపోతోన్న వారిలో ఎక్కువ మంది 48 నుంచి 56 సంవత్సరాల లోపు ఉన్న వారే ఉంటున్నారు. సీనియర్ల నుంచి జూనియర్ల వరకు తేడా లేకుండా అందరిని కరోనా బలి తీసుకుంటోంది. ఇక ఎడిషనల్ ఎస్పీ దక్షిణమూర్తి మరణం పోలీసు శాఖలో కరోనా కలకలం రేపుతోంది.