తెలంగాణలో కరోనా మరో మార్క్ క్రాస్ చేసింది. వాస్తవంగా సీఎం కేసీఆర్ చెపుతోన్న లెక్కలకు.. అక్కడ నమోదు అవుతోన్న కేసులకు పొంతన లేకుండా పోతోంది. కేసీఆర్ రోజు రోజుకు తెలంగాణలో కరోనా తగ్గుముఖం పుడుతుందని చెపుతున్నా వాస్తవంగా రోజు రోజుకు ఎక్కువ కేసులు నమోదు అవుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 2012 కేసులు నమోదు అయ్యాయి. దీంతో తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 70,958కు చేరుకుంది. ఇదిలా ఉంటే కరోనా నుంచి కొత్తగా 1139 మంది కోలుకోగా.. ఇప్పటివరకు కరోనా నుంచి 50,814 మంది పూర్తిగా కోలుకొని డిశ్చార్జి అయ్యారు.
గత 24 గంటల్లో కరోనాతో కొత్తగా 13 మంది మృతి చెందగా.. రాష్ట్రంలో మరణాల సంఖ్య 576కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 19,568 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తెలంగాణలో ఇప్పటివరకు 5,22,143 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. రోజు రోజుకు ఇక్కడ కేసులు పెరుగుతుంటే… ప్రభుత్వం మాత్రం కరోనా తీవ్రత అంతలేదన్నట్టుగా ఉండడంతో ప్రజల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. మరి ఇప్పటకి అయినా అక్కడ కరోనా పరీక్షల సంఖ్య పెంచడంతో పాటు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.