వాస్తవానికి రాజకీయాల్లో ఏదైనా జరిగితే వింతే. కానీ, ఒక్కొక్కసారి ఈ వింతలను కూడా మించిపోయేలా ఉండే ఘటనలు చోటు చేసుకుంటాయి. ఇప్పుడు అలాంటి ఘటనలే అధికార వైఎస్సార్ సీపీలో చోటు చేసుకుంటున్నాయి. ప్రకాశం జిల్లా పరుచూరు నియోజకవర్గంలో పాగా వేయాలనేది వైఎస్సార్ సీపీ అధినేత జగన్ ప్రధాన అజెండా. అయితే, ఇక్కడ బలమైన నాయకుడిగా, ప్రజానేతగా ఏలూరి సాంబశివరావు ఎదిగారు. పైగా ఆయన వివాద రహితుడు.. ప్రజలకు ఎప్పుడూ అన్ని వేళలా అందుబాటులో ఉన్న నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. అలాంటి నాయకుడిని ఓడించి, టీడీపీకి కంచుకోట వంటి ఈ నియోజకవర్గంలో పాగా వేయాలని జగన్ భావన.
దీనికి సంబంధించి ఆయన 2014 నుంచి స్కెచ్చులపై స్కెచ్చులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే కమ్మ వర్గానికిచెందిన గొట్టిపాటి భరత్‌కు 2014లో వైఎస్సార్ సీపీ టికెట్ ఇచ్చారు. అయితే, ఆయన ఓడిపోయారు. దాదాపు రెండేళ్ల పాటు పరుచూరు వైసీపీ అనాథగా ఉంది. దీంతో రావి రామనాథంను తీసుకువచ్చి ఇంచార్జ్ చేశారు. అయితే, ఆయన గత చంద్రబాబు హయాంలో ఇంచార్జ్‌గా ఉన్నప్పటికీ.. పార్టీ ఎదిగే పరిస్థితిని కల్పించలేక పోయారు. దీంతో ఎన్నికలకు ముందు జగన్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు కుమారుడు చెంచురామయ్యకు టికెట్ ఇవ్వాలని అనుకున్నారు. దీంతో అలిగిన రావి.. టీడీపీలోకి జంప్ చేశారు. ఇక, చెంచురామయ్యకు అమెరికా పౌరసత్వం రద్దు కాకపోవడంతో ఆయన బదులు దగ్గుబాటే నేరుగా పోటీ చేశారు.
అయితే, ఏలూరి హవా ముందు, ఆయనకున్న జనాదరణముందు దగ్గుబాటి రాజకీయం ముందుకు సాగలేదు. దీంతో ఆయన కూడా ఓడిపోయారు. ఈ పరిణామాలతో ఆయన పార్టీకి దూరమయ్యారు. దగ్గుబాటి పార్టీకి దూరమయ్యారు అనడం కంటే ఏలూరిని ఢీ కొట్టే సీన్ దగ్గుబాటికి లేదని జగనే ఆయన్ను పక్కన పెట్టేశారు. ఇక, జగన్ అధికారంలోకి రావడంతో రావి వచ్చి పార్టీలో చేరారు. ఇక, ఆయననే మళ్లీ ఇంచార్జ్ చేశారు. ఇక, ఇప్పుడు ఆయన దూకుడు ఏమీ బాగోలేదని, ఏలూరి ముందు ఆయన తేలిపోతున్నారని, ప్రజలు ఏలూరి పక్షానే ఉన్నారని తెలియడంతో మళ్లీ జగన్ మరో స్కెచ్ సిద్ధం చేసుకున్నారు.
రావి రామనాథంను కూడా పక్కన పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. చివరకు జిల్లాకు చెందిన మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి సైతం పరుచూరు పోతే పోతుందిలే… దానిని వదిలేద్దాం అని కూడా పార్టీ పెద్దలతో అన్నారన్న టాక్ బయటకు వచ్చింది అంటే పరుచూరు విషయంలో జగన్, జిల్లా పార్టీ నేతలు ఎంత చేతులు ఎత్తేశారో అర్థమవుతోంది. ఇక ఇప్పుడు ఇక్కడ ఏలూరిని ఢీ కొట్టేందుకు చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం ను కానీ, ఇక్కడ నుంచి వైఎస్సార్ సీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన ఆమంచిని కానీ, రంగంలోకి దింపి.. ఏలూరికి చెక్ పెట్టాలని భావిస్తున్నారు. అయితే వీరిలో ఆమంచి పరుచూరు వచ్చేందుకు ఇష్టపడడం లేదు.
కరణం మనసంతా అద్దంకి మీదే ఉంది. ఆయనకు కూడా పరుచూరు రావడం ఎంత మాత్రం ఇష్టం లేదు. మరోవైపు రావి రామనాథంకు డీసీఎంఎస్ చైర్మన్ పదవి ఇచ్చినా పట్టు దొరకని పరిస్థితి. పరుచూరులో ఏలూరి వ్యూహాలు వైసీపీకి ఎంతకు అంతు పట్టడం లేదు. ఈ బలమైన నేతను ఎదుర్కొనడం కోసం జగన్, వైసీపీ నేతలు వేస్తోన్న ఏ ఎత్తు కూడా పారడం లేదన్న టాక్ ఇప్పుడు జిల్లా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.