ఏపీ సీఎం జగన్‌పై ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. రాజధాని విభజనపై హైదరాబాద్ నుంచి మీడియాతో మాట్లాడిన ఆయన జగన్‌కు డెడ్‌లైన్ విధించడంతో పాటు సవాల్ విసిరారు. జగన్ 48 గంటల్లో అసెంబ్లీని రద్దు చేయాలని.. ఆ తర్వాత అందరం ఎన్నికలకు వెళదామని.. ఎన్నికల్లో తిరిగి వైఎస్సార్‌సీపీని గెలిపిస్తే… ప్రజలు జగన్ రాజధాని విభజనను ఆమోదించినట్టుగా తాము భావిస్తామని చంద్రబాబు చెప్పారు. తాను పిల్లల భవిష్యత్తు కోసమే ఇంత పోరాటం చేస్తున్నానని.. తాను ఎల్లుండి ఉదయం మళ్లీ మీడియా ముందుకు వస్తానని.. జగన్‌కు దమ్ముంటే ఈ లోగా అసెంబ్లీని రద్దు చేసే విషయం డిసైడ్ చేసుకోవాలని అన్నారు. జగన్‌కు ప్రజలను ఇబ్బంది పెట్టే, మోసం చేసే అధికారం ఎంత మాత్రం లేదని చంద్రబాబు అన్నారు.
జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అమరావతికి తన మద్దతు తెలిపారని.. ఇప్పుడు అమరావతి పతనం కోరుతున్నారని జగన్ నాటి నైజాన్ని బాబు బయట పెట్టారు. ఇక ఇప్పటికే రాజధాని విషయంలో చాలా వరకు నష్టపోయామని.. తెలుగుజాతికి చాలా అన్యాయం జరిగిందని.. మనం ఇంకా నష్టపోవడం సరికాదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. జగన్ భవిష్యత్ తరాల ప్రజలను మోసం చేస్తున్నారని చెప్పారు. జగన్ రాజధానిని విభజించడం ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం కాదా ? ఆయన పిచ్చి తుగ్లక్‌లా వ్యవహరిస్తూ పిచ్చి పనులు చేస్తున్నారని బాబు మండిపడ్డారు. ఇక రాజధాని ముక్కలు చేయడం మీకు నష్టమా కాదా ? జగన్ మిమ్మలను మోసం చేశాడా ? కాదా అన్నది ప్రజలే ప్రశ్నించుకోవాలని చంద్రబాబు సూచించారు.