ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి స్వైర విహారం చేస్తున్న సంగతి తెలిసిందే. కరోనా దెబ్బకు ఎప్పుడేం చెత్త వార్త వినాల్సి వస్తుందో ? అన్న భయాందోళనలు ప్రతి ఒక్కరిలోనూ ఉంటున్నాయి. రోజూ కొత్తగా కరోనా కేసులు, కరోనా మరణాలు పెరిగి పోతున్నాయి. కరోనా సోకితే కేవలం సామాన్యులే కాకుండా సెలబ్రిటీలు కూడా బలవుతున్నారు. తాజాగా యూపీ విద్యాశాఖా మంత్రి సైతం కరోనా భారీన పడి మృతి చెందారు. ఏపీలో మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు సైతం కరోనాకే బలయ్యారు. ఇలా రోజుకో దుర్వార్త కరోనా మనకు అందిస్తోంది.
ఇక ప్రపంచ వ్యాప్తంగా కరోనా లెక్కలు చూస్తే గుండె గుబేల్ మనేలా ఉన్నాయి. ఇప్పటి వరకు గత 24 గంటల్లో ప్రపంచ వ్యాప్తంగా 2,67,008 కోవిడ్ కేసుల సంఖ్య నమోదవ్వగా.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,80,25,812కి చేరింది. ఇక కరోనా మరణాలు ప్రపంచ వ్యాప్తంగా 7 లక్షలకు అతి సమీపంలో ఉన్నాయి. ఇక 60 లక్షల యాక్టివ్ కేసులు ఉండగా.. మరో 1.20 కోట్ల మంది కరోనా నుంచి కోలుకున్నారు. అగ్ర రాజ్యం అమెరికాతో పాటు యూరప్ దేశాలు అయిన ఇంగ్లాండ్, స్పెయిన్, లండన్, ఇటలీతో పాటు ఆసియా దేశాలు పాకిస్తాన్, జపాన్‌లో కూడా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి.
ఇక కరోనా కేసుల్లో మన దేశం ప్రపంచ వ్యాప్తంగా చూస్తే మూడో స్థానంలో ఉంది. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా మరో 54,735 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో మన దేశంలో కరోనాతో 853 మంది మృతి చెందారు. ఇక ఇప్పటి వరకు కరోనా సోకి 37 వేల మంది మృతి చెందారు. ఈ జోరు చూస్తుంటే భవిష్యత్తులో కొన్నేళ్ల పాటు వరుసగా షాకింగ్ న్యూస్‌లే వినాల్సి వస్తుందన్న ఆందోళనలు ప్రతి ఒక్కరిలోనూ ఉన్నాయి.