స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న పుష్ప సినిమా సెట్స్ మీదకు వెళ్లిందో లేదో అప్పుడే ఈ సినిమా కథ చుట్టూ అనేక కాంట్రవర్సీలు ముసురుకున్నాయి. వేంపల్లి గంగాధర్ అనే రచయిత చెపుతోన్న దాని ప్రకారం ఆయన ఎర్రచందనం సమస్య మీద, తమిళ కూలీల మీద అనేక కథలు రాశారు. ఆయనకు ఆ సబ్జెక్టుపై మంచి అవగాహన ఉంది. గంగాధర్ సాకి ఆదివారం అనుబంధంలో అప్పుడెప్పుడో రెండేళ్ల క్రితమే ఈ సమస్యపై కథనాలు రాశారు.
అలాగే తానే రాసిన ఎర్రచందనం దారిలో తమిళ కూలీలు అనే పుస్తకంలోని కంటెంటును తీసి దానిని సినిమాకు అనుగుణంగా మార్చి ఇప్పుడు అల్లు అర్జున్‌తో పుష్ప సినిమా చేస్తున్నారని ఆయన పరోక్షంగా ఆరోపిస్తున్నారు. ఆయన పెట్టిన పోస్టు చూస్తే అలాగే ఉంది. సహజంగానే ఈ ఆరోపణలపై ఖండనలు, సమర్థనలు, వాదోపవాదాలు నడుస్తాయి.
ఇక గతంలో ఇదే రచయిత రాసిన మొండికత్తి అనే కథతోనే అరవింద సమేత వీరరాఘవ సినిమా తీస్తున్నట్టు ఆయన ఆరోపణలు చేశారు. దీంతో ఒక్కసారిగా ఈ సినిమాపై వివాదం చెలరేగి చటుక్కున చల్లారిపోయింది. మరి ఇప్పుడు పుష్ప సినిమా విషయంలోనూ సదరు రచయిత అదే తరహా ఆరోపణలు చేస్తున్నారు. అయితే దీనిపై బన్నీ అభిమానులు మండి పడుతున్నారు. అసలు టీజర్లు, ట్రైలర్లు కూడా రిలీజ్ కాలేదు.. కథేంటో కూడా తెలియదు.. కావాలనే కొందరు పబ్లిసిటీ స్టంట్ కోసం ఇలా చీప్ ట్రిక్స్‌కు పాల్పడతారని కౌంటర్లు వేస్తున్నారు.