తెలంగాణాలో బిజెపి బలపడే ప్రయత్నాలు చేస్తుంది అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక్కడ ఎలా అయినా సరే పాగా వేయాలని ప్రయత్నాలు చేస్తున్న ఆ పార్టీ కొంత మంది ఇతర పార్టీలకు చెందిన కీలక నేతల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. వచ్చే ఎన్నికల నాటికి కేసీఆర్‌ను తెలంగాణలో ఎలాగైనా గద్దె దించాలని ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఇతర పార్టీలకు చెందిన బలమైన నేతలను ఒక్కొక్కరిని పార్టీలోకి తీసుకునే విధంగా, ఇక్కడి అధికార, విపక్షాల మీద ప్రత్యేకంగా ఫోకస్ చేస్తూ రాజకీయం చేస్తుంది.
ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మీద బిజెపి అధిష్టానం ఫోకస్ చేసింది అనే వార్తలు గత కొన్ని రోజులుగా వస్తూనే ఉన్నాయి. ఆయన కోసం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు అనే ప్రచారం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు కిషన్ రెడ్డితో పాటుగా బండి సంజయ్, సుజనా చౌదరి కూడా ఆయనకు ఆఫర్ ఇచ్చారు అనే వార్తలు ఈ మధ్య కాలంలో వస్తున్నాయి. గత కొంత కాలంగా రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో ఇమడ లేకపోతున్నారన్నది వాస్తవం. మరో ఐదారు నెలలకు అయినా రేవంత్‌రెడ్డికి తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలు ఇవ్వకపోతే ఆయన తన దారి తాను చూసుకునేందుకు రెడీగా ఉన్నారు.
ఈ క్రమంలోనే ఆయన అసంతృప్తిని గమనించిన బీజేపీ అధిష్టానం ఆయనకు వలవేసింది. అందుకే ఆయనకు కొన్ని ఆఫర్లు వరుసగా ఇస్తున్నారు. 2024 ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గెలిస్తే కేంద్ర మంత్రి పదవి ఇవ్వడమే కాకుండా, ఓడిపోతే మాత్రం ఆయనకు రాజ్యసభ సీటుతో పాటుగా రాష్ట్ర పార్టీ బాధ్యతలు, కర్ణాటక రాష్ట్రానికి ఇంచార్జ్ ని కూడా చేస్తామని హామీ ఇచ్చారట. కొన్ని కీలక పదవులను కేంద్రంలో ఈ మూడేళ్ళలో ఇస్తామని ఆఫర్ ఇచ్చారట. ఏ ఇబ్బంది లేకుండా స్వేచ్చగా పని చేసుకునే పరిస్థితి కల్పిస్తామని చెప్పారట. మరి రేవంత్ రూటు ఎలా ఉంటుందో ? చూడాలి.