ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఏపీకి మూడు రాజధానుల అంశంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. అధికార వైఎస్సార్‌సీపీ పరిపాలనా వికేంద్రీకరణ పేరుతో ఏపీ రాజధానిని మూడు ప్రాంతాల్లోకి మార్చేస్తోంది. దీనిపై రాజధాని రైతులు కోర్టుకు వెళ్లడంతో ప్రస్తుతం ఈ ప్రక్రియకు బ్రేక్ పడింది. ఇక విపక్ష టీడీపీతో పాటు రాజధాని ప్రాంతంలో పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు అమరావతినే రాజధానిగా ఉంచాలని పోరాటాలు చేస్తున్నారు. ఇప్పటికే అమరావతి ఉద్యమం 250 రోజులు దాటేసింది.
ఇక అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలా ? లేదా ? మూడు రాజధానులు ఉండాలా ? అన్న అంశంపై ఓ జాతీయ ఛానెల్ నిర్వహించింది. ఈ సర్వేలో ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతే ఉంచాలని మెజార్టీ ప్రజలు తీర్పు ఇచ్చారు. ఆరు రోజుల్లో మొత్తం ఈ సర్వేలో 3.76 లక్షల మంది ప్రజలు పాల్గొన్నారు. అమరావతిని కోరుకుంటూ 95 శాతం మంది ప్రజలు ఓట్లు వేశారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏపీ అభివృద్ధి చెందాలంటే ఒకే రాజధాని ఉండాలని.. దేశంలో ఏ రాష్ట్రానికి లేని విధంగా మూడు రాజధానులు ఉండడం వల్ల ఉపయోగం లేదని మెజార్టీ ప్రజలు ఏకగ్రీవంగా చెప్పారు.
ఇక అంతకు ముందే దీనిపై మరో సర్వే జరిగింది. ఈ యేడాది జనవరి 20న ఏపీ శాసనసభలో పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్డీయే బిల్లు రద్దును అసెంబ్లీలో ఆమోదించారు. ఆ మరుసటి రోజునే ఇండియా టీవీ ఛానెల్ దీనిపై ట్విట్టర్‌లో పోల్ నిర్వహించింది. ఈ సర్వేలో పాల్గొన్న వారిలో 67 శాతం మంది మూడు రాజధానులు మంచివి కావని చెపితే 29 శాతం మంది మాత్రమే మూడు రాజధానులకు అనుకూలంగా ఓటు వేశారు. నాలుగు శాతం మంది మాత్రం ఏమీ చెప్పలేమన్నారు. ఈ సర్వేలో సుమారు 8 వేలమంది పాల్గొన్నారు.