భూమ్మీద నూకలు ఉంటే ఎవరు అయినా చనిపోవాలనుకుని ఆత్మహత్యా ప్రయత్నం చేసినా బతుకుతారు. తాజాగా తూర్పుగోదావరిలో జరిగిన సంఘటనే ఇందుకు నిదర్శనం. భార్యతో గొడవ పడ్డ ఓ 73 ఏళ్ల వృద్ధుడు గోదావరిలోకి దూకేశాడు. అయితే అతడు బతికి బయట పడ్డాడు. రాజమండ్రి తాడితోటకు చెందిన జి.అప్పారావు (73) కొంత కాలంగా భార్యతో గొడవలు పడుతున్నాడు. ఆదివారం అప్పారావు గోదావరిలోకి దూకి చనిపోవాలని నిర్ణయించుకున్నాడు.
ఇస్కాన్ టెంపుల్ రేవువద్దకు వచ్చి గోదావరిలోకి దూకేశాడు. ఈత రావడంతో అతడు ప్రవాహానికి కొట్టుకుపోయాడు. అలా కొట్టుకుంటూ కొంత దూరం వెళ్లే సరికి ఓ దుంగ కనిపించడంతో దానిని పట్టుకుని కూర్చున్నాడు. అతడిని గమనించిన స్థానికులు హుటాహుటిన 100 నంబర్‌కు సమాచారం అందించారు. వెంటనే డీఎస్పీ వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు పోలీసులు అక్కడకు చేరుకున్నారు. వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులు కూడా వచ్చారు.
గోదావరి మధ్యలో దుంగపై ఉన్న అప్పారావు వద్దకు తాడుకు లైఫ్ జాకెట్ కట్టి విసిరారు. అతడు ఆ తాడు పట్టుకున్న తరువాత ఒడ్డుకు చేర్చారు. చివరకు ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చేరవేశారు. కుటుంబ సభ్యులు వచ్చి అప్పారావును ఇంటికి తీసుకువెళ్లారు.