Moviesపలాస 1978 రివ్యూ & రేటింగ్

పలాస 1978 రివ్యూ & రేటింగ్

సినిమా: పలాస 1978
నటీనటులు: రక్షిత్, నక్షత్ర, రఘు కుంచె తదితరులు
సినిమాటోగ్రఫీ: విన్సెంట్ ఆరుల్
మ్యూజిక్: రఘు కుంచె
నిర్మాత: మనోజ్ కుమార్,ధ్యాన్ అట్లూరి
దర్శకత్వం: కరుణ కుమార్
రిలీజ్ డేట్: 6 మార్చి 2020

కొత్త నటీనటులతో తెరకెక్కిన పలాస 1978 చిత్రం రిలీజ్‌కు ముందే మంచి అంచనాలను క్రియేట్ చేసింది. ఈ సినిమాను పలువురు సెలబ్రిటీలు ప్రమోట్ చేయడంతో ఈ సినిమా ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో కూడా అంచనాలను క్రియేట్ చేసింది. ఇక నేడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుందో రివ్యూలో చూద్దాం.

కథ:
పలాస గ్రామంలో కులం, రాజకీయం అనే పలుకుబడితో తమకు అన్యాయం జరుగుతుందని మోహన్ రావు(రక్షిత్) అక్కడి నాయకులకు, పెద్దలకు ఎదురుతిరుగుతాడు. మోహన్ రావు తమకు ఎప్పటికైనా ప్రమాదం తీసుకొస్తాడని భావించిన చిన్న షావుకారు గురుమూర్తి (రఘు కుంచె) అతడి అడ్డును తొలగించుకోవాలని చూస్తాడు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య జరిగే పోరాటమే ఈ సినిమా కథ. పలాసలో కుల, వర్గాల తేడాను మోహన్ రావు తొలగించాడా? ఈ క్రమంలో అతడికి ఎదురైన సవాళ్లు ఏమిటి? వాటిని ఎలా అధిగమించాడు? అనేది ఈ సినిమా కథ.

విశ్లేషణ:
పలాస 1978 అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో దర్శకుడు కరుణ కుమార్ ఈ సినిమాను తెరకెక్కించిన విధానం బాగున్నా, సినిమా కథ పరమ రొటీన్ కావడంతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో వెనకబడింది. ఈ సినిమాను పూర్తి యాక్షన్, డ్రామా, క్రైమ్ అంశాలతో నింపేసిన దర్శకుడు సరైన రీతిలో సినిమాను తీయడంలో విఫలమయ్యాడు. ఇక కథనం విషయానికి వస్తే ఫస్టాఫ్‌లో ఇరు వర్గాల మధ్య కుల, వర్గ బేధాలను మనకు చూపించిన దర్శకుడు, వాటిని హీరో ఏ విధంగా రూపుమాపేందుకు ప్రయత్నించాడో మనకు చక్కగా చూపించాడు.
ఈ క్రమంలో అతడు ఎదురుతిరిగిన విధానం, అందులో అతడు చేసే పోరాట పటిమను మనకు బాగా చూపించాడు. అయితే ఓ ట్విస్టుతో వచ్చే ఇంటర్వెల్ బ్యాంగ్ బాగుండటంతో ప్రేక్షకులు సెకండాఫ్‌లో మరింత స్టఫ్ ఉంటుందని ఆశిస్తారు.

ఇక సెకండాఫ్‌లో హీరో తనకు ఇష్టమైన వ్యక్తిని కోల్పోవడంతో తన ప్రత్యర్థులను ఎలా ఎదురించాడు అనే అంశాన్ని మాత్రమే ఫోకస్ చేసి చూపించారు. ఈ క్రమంలో కొన్ని సీన్లు చాలా సాగతీతగా అనిపిస్తాయి. ఇక మనం ఊహించే విధంగా క్లైమాక్స్ ఉండటంతో సినిమాపై జనాలకు ఆసక్తి పూర్తిగా పోతుంది. రొటీన్ ఫైట్ సీక్వెన్స్‌తో సినిమాకు శుభం కార్డు వేశాడు దర్శకుడు. ఇలా చక్కటి స్క్రీన్‌ప్లే, నటీనటులు, సంగీత విలువలు ఉన్న సినిమాకు రొటీన్ కథనం పెద్ద దెబ్బేసింది.

ఓవరాల్‌గా ‘పలాస 1978’ వైవిధ్యమైన సినిమా అనుకుని థియేటర్‌కు వెళ్లే వారికి నిరాశే మిగులుతుంది. ఒక రొటీన్ కథను మంచి టైటిల్‌తో మనముందుకు తీసుకొచ్చిన కరుణ కుమార్, సరైన పద్ధతిలో సినిమాను తెరకెక్కించడంలో విఫలమయ్యాడు. ఈ సినిమా కొన్ని వర్గాల ప్రేక్షకులను మాత్రమే మెప్పిస్తుంది.

నటీనటులు:
ఈ సినిమాలో హీరోగా నటించిన రక్షిత్ ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకున్నాడు. ఎమోషన్స్, యాక్షన్, రొమాంటిక్ సీన్స్‌లో అతడు చూపిన ఎక్స్‌ప్రెషన్స్ బాగున్నాయి. అటు హీరోయిన్ నక్షత్ర నటనకు ప్రాధాన్యత లేని పాత్ర రావడంతో తేలిపోయింది. ఇక ఈ సినిమాకు మరో హైలైట్ రఘు కుంచె. సంగీత దర్శకుడిగానే కాకుండా విలన్ పాత్రలో చాలా పవర్‌ఫుల్ పాత్రలో మనల్ని మెప్పించాడు. మిగతా నటీనటులు కొత్తవారు కావడంతో ప్రేక్షకులు వారిని గుర్తుపట్టలేకపోయారు.

టెక్నికల్ డిపార్ట్‌మెంట్:
పలాస 1978 చిత్రానికి కెప్టెన్ అయిన దర్శకుడు కరుణ కుమార్ ఎంచుకున్న కథ రొటీన్ కావడంతో ఈ సినిమా ప్రేక్షకులను అలరించలేకపోయింది. యాక్షన్, క్రైమ్, డ్రామా వంటి అంశాలు పుష్కలంగా ఉన్న సినిమాకు కరుణ కుమార్ రొటీన్ కథ ఏమాత్రం ఉపయోగపడలేదు. ఇక ఈ సినిమాకు అతడు అందించిన స్క్రీన్‌ప్లే సూపర్‌గా ఉంది. రఘు కుంచె అందించిన సంగీతం, ముఖ్యంగా బీజీఎం మాత్రం సూపర్‌ అని చెప్పాలి. నిర్మాణ విలువలు బాగున్నాయి.

చివరగా:
పలాస 1978 – ఆకట్టుకోలేకపోయిన చిత్రం!

రేటింగ్:
2.5/5.0

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news