సినిమా: జాను
నటీనటులు: శర్వానంద్, సమంత, వెన్నెల కిషోర్, వర్షా బొల్లమ్మ తదితరులు
సంగీతం: గోవింద్ వసంత
సినిమాటోగ్రఫీ: మహేందిరన్ జయరాజు
నిర్మాత: దిల్ రాజు, శిరీష్
దర్శకత్వం: ప్రేమ్ కుమార్
రిలీజ్ డేట్: 07-02-2020
యంగ్ హీరో శర్వానంద్, స్టార్ బ్యూటీ సమంత కలిసి నటిస్తున్న తాజా చిత్రం ‘జాను’ మంచి అంచనాలను క్రియేట్ చేసుకుంది. తమిళంలో సూపర్ హిట్ అయిన 96 చిత్రానికి రీమేక్‌గా వస్తున్న జాను చిత్రం ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేసింది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్స్‌తో ఆ అంచనాలు రెట్టింపు అయ్యాయి. కాగా ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న జాను చిత్రం ప్రేక్షకులను ఎంతమేర అలరించిందో రివ్యూలో చూద్దాం.
కథ:
ట్రావెల్ ఫోటోగ్రాఫర్ అయిన రామచంద్ర అలియాస్ రామ్(శర్వానంద్) తాను చదువుకున్న స్కూల్‌ను చూసేందుకు వెళతాడు. అక్కడ అతడికి తన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. ఈ క్రమంలో జానకి దేవి అలియాస్ జాను(సమంత)తో చిన్నతనంలో ప్రేమలో పడిన సంఘటనలు గుర్తుకు చేసుకుంటాడు. కట్ చేస్తే, చిన్ననాటి స్నేహితులు అందరూ కలిసి గెట్ టుగెదర్ పార్టీని ఏర్పాటు చేస్తారు. ఈ పార్టీకి జాను కూడా వస్తుంది. అయితే జానును చూసిన రామ్ తన ప్రేమ గురించి ఆమెకు తెలిపాడా..? చిన్నతనం నుండి టీనేజ్ వరకు జానును ప్రేమించిన రామ్,మధ్యలో ఎందుకు వెళ్లిపోయాడు? చివరకు ఈ ప్రమేకథకు ఎలాంటి ముగింపు పడిందనేది చిత్ర కథ.
విశ్లేషణ:
తమిళంలో 96 చిత్రాన్ని చూడని వారికి జాను చిత్రం ఓ పర్ఫెక్ట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ అని చెప్పాలి. దర్శకుడు ప్రేమ్‌కుమార్ కథలో ఎలాంటి మార్పులు లేకుండా జాను సినిమాను తెరకెక్కించాడు. చిన్నతనంలోనే ప్రేమలో పడ్డ ఓ కుర్రాడు తాను ప్రేమించిన అమ్మాయిన చూడగానే అతడిలో కలిగే ఎమోషన్స్‌ను మనకు కళ్లకు కట్టినట్లు చూపించారు. ఇక కథనం విషయానికి వస్తే.. ఫస్టాఫ్‌లో రామ్ తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుకుచేసుకుంటూ, స్కూల్‌లో మొదలయ్యే ప్రేమ కథను మనకు చూపించారు. తనకు ఇష్టమైన అమ్మాయి ఎదురవ్వగానే ఆ అబ్బాయి పడే ఆరాటం ఎలా ఉంటుందో మనకు చూపించారు. అమ్మాయితో మాట్లాడటానికే భయపడే ఆ అబ్బాయి, అమ్మాయిపై ఇంతలా ప్రేమ పెంచుకోవడానికి కారణమేమిటనేది మనకు చాలా స్పష్టంగా చూపించారు.
ఇక తాను ప్రేమించిన అమ్మాయిని ఇంప్రెస్ చయడానికి ఆ అబ్బాయి పడే పాట్లు కూడా మనకు బాగా కనెక్ట్ అవుతాయి. అయితే అంతలా ప్రేమించిన అమ్మాయి సెలవుల సమయంలో ఎవరికీ చెప్పకుండా ఆ అబ్బాయి వదిలి వెళ్లిపోవడం అనే టిస్టుతో ఇంటర్వెల్ బ్యాంగ్‌ను చూపించారు చిత్ర దర్శకుడు. ఇక సెకండాఫ్‌లో తాను ప్రేమించిన జాను చాలా ఏళ్ల తరువాత గెట్ టుగెదర్ పార్టీలో కలవడంతో అప్పుడు కూడా రామ్ అంతే ప్రేమను తనలో చూపిస్తాడు. జాను తనతో మాట్లాడిన క్షణం నుండి ఆమెపై రామ్‌కు ఉన్న ప్రేమను మనకు చాలా స్పష్టంగా చూపించాడు దర్శకుడు. అయితే జానును తాను ఎందుకు విడిచి వెళ్లాల్సి వచ్చిందో చెప్పే క్రమంలో జాను రామ్‌ను శాశ్వతంగా విడిచి వెళ్తోందనే నిజం చెప్పడంతో, వారి ప్రేమకథకు ఎలాంటి ముగింపు పలికారనేది చిత్ర క్లైమాక్స్.
ఓ ఫీల్‌గుడ్ లవ్ స్టోరీని మన కళ్లకు కట్టినట్లు జాను సినిమాలో చూపించారు. చిన్నంతనంలోనే ఏర్పడే ప్రేమ, చివరివరకు ఉంటుందనే కాన్సెప్ట్‌న ఈ సినిమా ద్వారా మనకు మరోసారి చూపించారు. ఓవరాల్‌గా జాను సినిమా ప్రేమికులను మరింత ఆకట్టుకుంటుంది. ఇక రామ్ పాత్రలో తమను తాము చూసుకుంటారు చాలా మంది అబ్బాయిలు. ఇలా రియాలిటీకి దగ్గరగా ఉండే ప్రేమకథలు ఈ మధ్యకాలంలో రాలేదనే చెప్పాలి. దర్శకుడు ప్రేమ్ కుమార్ రాసుకున్న కథ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించడంలో సక్సె్స్ అయ్యిందనే చెప్పాలి.
నటీనటుల పర్ఫార్మెన్స్:
రామ్‌గా శర్వానంద్ యాక్టింగ్ చాలా బాగుంది. శర్వా తన పాత్రలో జీవించి చేశాడని చెప్పాలి. తాను ప్రేమించిన అమ్మాయి చాలా ఏళ్ల తరువాత ఎదురవ్వడంతో ఓ ప్రేమికుడు ఎలా ఫీలవుతాడో మనకు శర్వాను చూస్తే నిజంగా ఇలానే ఉంటుందేమో అనిపిస్తుంది. ఇక జాను పాత్రలో సమంత కూడా అదరగొట్టింది. కొన్ని సీన్స్‌లో ఆమె చూపించిన ఎక్స్‌ప్రెషన్స్ అదరగొట్టాయి. మిగతా నటీనటులు వారి పరిధి మేర బాగానే చేశారు.
టెక్నికల్ డిపార్ట్‌మెంట్:
దర్శకుడు ప్రేమ్‌కుమార్ తమిళంలో తెరకెక్కించిన 96 కథకు ఎలాంటి మార్పులు లేకుండానే జాను సినిమాను మనముందుకు తీసుకొచ్చాడు. ఇలాంటి కథకు ఎలాంటి మార్పులు చేసినా సినిమా సైడ్ ట్రాక్ అయ్యే అవకాశం ఉండటంతో దర్శకుడు తీసుకున్న నిర్ణయాన్ని మెచ్చుకోవాలి. తాను రాసుకున్న కథ ప్రేమికుల కోసమే అని మొదట్నుండీ చెబుతూ వచ్చాడు. దానికి పూర్తి న్యాయం చేశాడు ఈ డైరెక్టర్. ఇక సంగీతం అందించిన గోవింద్ వసంత మరోసారి 96 ఫీల్‌ను మనకు కలిగించాడు. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
చివరగా:
జాను – ప్రేమికుల కోసం ప్రేమను పంచిన చిత్రం!
రేటింగ్:
3.0/5.0