ఆసుపత్రిలో చేరినా డిస్కో రాజా చూడమంటున్న సునీల్

తెలుగులో కమెడియన్ నుండి హీరోగా మారిన సునీల్ గతకొంతకాలంగా మళ్లీ కామెడీ పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అయితే తాజాగా సునీల్ ఆరోగ్యం క్షీణించడంతో ఆయన కుటుంబ సభ్యులు హుటాహుటిని ఆసుపత్రిలో చేర్పించడంతో ఈ వార్త ఒక్కసారిగా టాలీవుడ్‌లో హల్‌చల్ సృష్టించింది. అయితే సునీల్‌కు ఏం కాలేదంటూ అక్కడి వైద్యులు తెలిపారు.

కొన్నిరోజులుగా గొంతు జ్వరంతో బాధపడుతున్న సునీల్‌కు బుధవారం రాత్రి శ్వాసతీసుకోవడం కష్టంగా మారడంతో, ఆయన కుటుంబ సభ్యులు గురువారం ఉదయం ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం తాను వైద్యుల పర్యవేక్షణలో క్షేమంగా ఉన్నానని, తన పట్ల ప్రేక్షకులు, అభిమానులు చూపించిన ప్రేమకు కృతజ్ఞతలు తెలిపాడు సునీల్. ఈ సందర్భంగా తన ఆరోగ్య పరిస్థితిపై సోషల్ మీడియాలో ట్వీట్ చేశాడు.

తన క్షేమం కోరిన ప్రతిఒక్కిరికి ధన్యవాదాలు తెలుపుతూనే, తాను నటించిన డిస్కో రాజా చిత్రాన్ని చూసి ఆనందించాలంటూ కోరాడు. సునీల్ ఆరోగ్య పరిస్థితిపై పలువురు సినీ ప్రముఖులు ఆరా తీశారు. కాగా గొంతు ఇన్ఫెక్షన్‌తో సునీల్‌ బాధపడుతున్నట్లు వైద్యులు వెల్లడించారు.

Leave a comment