సినిమా: అశ్వధ్ధామ
నటీనటులు: నాగశౌర్య, మెహ్రీన్ పీర్జాదా, ప్రిన్స్, పోసాని కృష్ణమురళీ తదితరులు
సంగీతం: శ్రీచరణ్ పాకాల
నిర్మాత: ఉషా ముల్పూరి
దర్శకత్వం: రమణ తేజ
రిలీజ్ డేట్: 31-01-2020
యంగ్ హీరో నాగశౌర్య నటించిన లేటెస్ట్ మూవీ అశ్వధ్ధామ పోస్టర్స్, టీజర్, ట్రైలర్లతో మంచి అంచనాలను క్రియేట్ చేసింది. ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కడంతో అశ్వధ్ధామపై చిత్ర యూనిట్ ధీమాగా ఉన్నారు. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలు ఎంతమేర అందుకుందో రివ్యూలో చూద్దాం.
కథ:
గణా(నాగశౌర్య) చెల్లెలి నిశ్చితార్థం, పెళ్లి జరిగే సమయంలో వరుస కిడ్నాప్‌ల కలకలం రేగుతుంది. నగరంలో అమ్మాయిలను కిడ్నాప్ చేయడం, వారిని కిరాతకంగా హతమార్చడం చోటు చేసుకుంటాయి. ఈ క్రమంలో గణకు అనుకోని సంఘటన ఎదురవుతుంది. దీంతో అతడు అమ్మాయిలను కిడ్నాప్ చేస్తున్న ముఠాను పట్టుకుని వారి వెనకాల ఎవరున్నారనే విషయం తెలుసుకునేందుకు వేట మొదలుపెడతాడు. ఈ క్రమంలో అతడికి ఎదురయ్యే సవాళ్లు ఏమిటి? వాటిని అతడు ఎలా ఎదుర్కొన్నాడు? ఈ కిడ్నాప్‌లు, హత్యలు ఎవరు చేస్తున్నారు? అనేది సినిమా కథ.
విశ్లేషణ:
ఒక సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన అశ్శధ్ధామ సినిమాకు కథను నాగశౌర్య అందించాడు. ఖచ్చితంగా హిట్ అందుకోవాలని చూస్తు్న్న నాగశౌర్య ఈ సినిమా విజయంపై పూర్తి ధీమాగా ఉన్నాడు. ఇక ఈ సినిమా కథనం విషయానికి వస్తే ఫస్టాఫ్‌లో హీరో ఇంట్రొడక్షన్ మొదలుకొని వరుస కిడ్నాప్‌లు, హత్యలు జరుగుతుండటంతో వాటిని ఛేదించే పనిలో పోలీసులు నిమగ్నమవుతారు. అయితే నాగశౌర్యకు షాక్ ఇచ్చే ఓ సంఘటన ఎదురవ్వడంతో ఇంటర్వెల్ బ్యాంగ్ వస్తుంది.
ఇక సెకండాఫ్‌లో నాగశౌర్య ఈ కిడ్నాప్‌లు, మర్డర్‌ల వెనకాల ఉన్న వ్యక్తిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తాడు. పోలీసుల సహాయం దొరకకపోవడంతో అతడు స్వయంగా ఈ సాహసం చేపడతుతాడు. ఈ క్రమంలో అతడికి అనేక విస్తుపోయే విషయాలు తెలుస్తాయి. ఇందులో భాగంగా ఈ ఘటనల వెనక ఉన్న ముఠాను అతడు ఎలా మట్టుబెట్టాడనేది మనకు ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్ సీన్స్‌లో చూపించారు. ఒక మంచి పాయింట్‌తో సినిమాకు శుభం కార్డు వేశారు చిత్ర యూనిట్.
ఓవరాల్‌గా చూస్తే, ఓ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాకు కావాల్సిన అంశాలన్నీ ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నాయి. అయినా ఎక్కడో తేడా కొట్టడంతో ఈ సినిమా అనుకున్న స్థాయిలో మెప్పించలేకపోయింది. నాగశౌర్య ఈ సినిమాను వన్ మ్యాన్ షోగా నడిపించి మెప్పించాడు.
నటీనటులు పర్ఫార్మెన్స్:
నాగశౌర్య ఈ సినిమాలో తనదైన యాక్టింగ్‌తో మెప్పించాడు. యాక్షన్, ఎమోషన్ సీన్స్‌లో నాగశౌర్య నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. విలన్ పాత్రలో నటించిన మరో హీరో ప్రిన్స్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేశాడు. కాగా హీరోయిన్‌గా మెహ్రీన్ పీర్జాదా మరోసారి ఫెయిల్ అయ్యింది. ఇక మిగతా నటీనటులు తమ పాత్రల మేర బాగానే నటించారు.
టెక్నికల్ డిపార్ట్‌మెంట్:
దర్శకుడు రమణ తేజ ఈ సినిమాను చాలా బాగా హ్యాండిల్ చేశాడు. కథ పరంగా కొత్తదనం ఉన్నా, రొటీన్ అంశాలు ఈ సినిమాకు మైనస్ అయ్యాయి. దర్శకుడిగా రమణ తేజ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. శ్రీచరణ్ పాకల సంగీతం పర్వాలేదనిపించింది. నాగశౌర్య అందించిన కథ ఈ సినిమాకు మేజర్ బలం అని చెప్పొచ్చు. నిర్మాణ విలువలు బాగున్నాయి.
చివరగా:
అశ్వధ్ధామ – ఆకట్టుకునే సస్పెన్స్ థ్రిల్లర్
రేటింగ్:
3.0/5.0