Moviesకార్తీ దొంగ మూవీ రివ్యూ & రేటింగ్

కార్తీ దొంగ మూవీ రివ్యూ & రేటింగ్

సినిమా: దొంగ
నటీనటులు: కార్తీ, జ్యోతిక, సత్యరాజ్, నిఖిలా విమల్ తదితరులు
సినిమాటోగ్రఫీ: ఆర్.డి.రాజశేఖర్
సంగీతం: గోవింద్ వసంత
దర్శకత్వం: జీతూ జోసెఫ్

తమిళ హీరో కార్తీ నటించిన తాజా చిత్రం దొంగ. తమిళ హీరో సూర్య భార్య జ్యోతిక ముఖ్య పాత్రలో నటించిన దొంగ సినిమాపై తమిళ ఇండస్ట్రీలో మంచి బజ్ ఏర్పడింది. అయితే తెలుగులో ఖైదీ సినిమా సూపర్ సక్సెస్ అయినా దొంగ సినిమా టీజర్, ట్రైలర్లలో కొత్తదనం లేకపోవడంతో తెలుగు ఆడియెన్స్ ఈ సినిమాను పెద్దగా పట్టించుకోవడం లేదు. దీనికి తోడు సినిమా ప్రమోషన్స్ కూడా అంతంత మాత్రంగా ఉండటం, రెండు తెలుగు సినిమాలు రిలీజ్ కావడంతో దొంగ సినిమా నేడు(డిసెంబర్ 20) రిలీజ్ అవుతున్న విషయం కూడా చాలా మందికి తెలియకుండా పోయింది. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

కథ:
సత్యరాజ్ కొడుకు శర్వా 15 సంవత్సరాల క్రితం తప్పిపోతాడు. కాగా తానే శర్వా అంటూ కార్తీ వారింటికి చేరుతాడు. అయితే అతడే శర్వా అని అందరూ నమ్ముతారు. కానీ సత్యరాజ్ కూతురు జ్యోతిక మాత్రం శర్వాను అస్సలు నమ్మదు. నిజానికి అతడొక దొంగ అనే విషయాన్ని జ్యోతిక తెలుసుకుంటుంది. కట్ చేస్తే.. సత్యరాజ్ కుటుంబానికి శర్వా దగ్గరవ్వాలని పలు ప్రయత్నాలు చేస్తాడు. నిజంగా కార్తీయే సత్యారజ్ కొడుకు శర్వానా? జ్యోతిక శర్వాను నమ్ముతుందా? అసలు శర్వ ఎవరు? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:
దృశ్యం లాంటి డిఫరెంట్ సినిమాను తెరకెక్కించిన డైరెక్టర్ జీతు జోసెఫ్ డైరెక్ట్ చేసిన సినిమా కావడంతో దొంగ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. కానీ కథనంలో కొత్తదనం లేకపోవడం, పాతచింతకాయ పచ్చడిలా కథ ఉండటంతో ప్రేక్షకులకు ఈ సినిమా ఎక్కదు. ఇక కథనం విషయానికి వస్తే, ఫస్టాఫ్‌లో అల్లరిచిల్లరి దొంగగా కార్తీ ఎంట్రీ, సత్యరాజ్ కుటుంబం, జ్యోతిక ఇంట్రొడక్షన్‌లతో పాటు వారికి సంబంధించిన కథలను చూపించారు. ఇక కార్తీ జ్యోతిక ఇంటికి చేరుకుని వారికి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తాడు. ఈ క్రమంలో వచ్చే ఇంటర్వెల్ బ్యాంగ్ బాగుంది.

అటు సెకండాఫ్‌లో జ్యోతిక కుటుంబానికి అండగా కార్తీ నిలుస్తాడు. జ్యోతిక, సత్యరాజ్‌ల సమస్యలను తన సమస్యలుగా కార్తీ పరిష్కరించే విధానం బాగుంది. ప్రీక్లైమాక్స్, క్లైమాక్స్‌లలో వచ్చే ట్విస్టులతో సినిమాకు శుభం కార్డు వేశారు చిత్ర డైరెక్టర్. శర్వా పాత్రలో కార్తీ డిఫరెంట్ షేడ్స్‌లో చేసే యాక్టింగ్ ప్రేక్షకులను మెప్పిస్తుంది. సీరియస్ పాత్రలో జ్యోతిక నటన కూడా బాగుంది.

ఓవరాల్‌గా చూస్తే పాత కథే అయినా డైరెక్టర్ ప్రెజెంట్ చేసిన విధానం బాగుంది. కానీ స్క్రీన్‌ప్లే, మ్యూజిక్ ఈ సినిమాకు మైనస్‌గా మారడంతో దొంగ సినిమా బాక్సాఫీస్ వద్ద నెగెటివ్ టాక్‌ను మూటగట్టుకోవడం ఖాయం.

నటీనటుల పర్ఫార్మెన్స్:
దొంగ పాత్రలో కార్తీ యాక్టింగ్ చాలా బాగుంది. కన్నింగ్ వ్యక్తిగా ఉంటూనే శర్వా లాంటి అమాయకమైన పాత్రలో కార్తీ డిఫరెంట్ షేడ్స్ చూపించాడు. అటు యాక్షన్, ఎమోషన్ సీన్స్‌లోనూ కార్తీ మెప్పించాడు. శర్వా అక్క పాత్రలో జ్యోతిక నటన బాగుంది. సత్యరాజ్ పాత్రకు పెద్దగా ప్రాముఖ్యత లేదు. ఇక హీరోయిన్ పాత్ర ఈ సినిమాలో కేవలం పాటల కోసమే ఉందా అనే విధంగా ఉంది. మిగతావారు తమ పాత్రల మేర పర్వాలేదనిపించారు.

టెక్నికల్ డిపార్ట్‌మెంట్:
దృశ్యం లాంటి సెన్సేషనల్ సినిమాను అందించిన జీతూ జోసెఫ్, దొంగ లాంటి సినిమాను డైరెక్ట్ చేశారంటే నమ్మశక్యంగా లేదు. ఒక పాత కథను కొత్తగ ప్రెజెంట్ చేసే క్రమంలో సినిమాను సైడ్ ట్రాక్ చేశారు. సినిమాటోగ్రఫీ ఒక్కటే ఈ సినిమాలో చెప్పుకోదగ్గ అంశం అని చెప్పాలి. సంగీతం కూడా సినిమాకు చేసిందేమీ లేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

చివరగా:
దొంగ – మళ్లీ ట్రాక్ తప్పిన కార్తీ

రేటింగ్:
2.0/5.0

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news