నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం రూలర్ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్న నందమూరి ఫ్యాన్స్‌కు నిరాశ మిగిల్చారు రూలర్ చిత్ర దర్శకనిర్మాతలు. రొటీన్ కథతో ప్రేక్షకులకు చుక్కలు చూపించిన ఈ సినిమా దర్శకనిర్మాతలు మరోసారి బాలయ్య అభిమానులను ఇబ్బంది పెట్టేందుకు రెడీ అవుతున్నారు.
బాలయ్యతో తన నెక్ట్స్ మూవీని తెరకెక్కించేందుకు నిర్మాత సి.కళ్యాణ్ ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడ మరో విశేషమేమిటంటే ఈ సినిమాకు దర్శకత్వం కూడా జైసింహా, రూలర్ చిత్రాల దర్శకుడు కెఎస్ రవికుమార్ అని చెప్పాడు కళ్యాణ్. రూలర్ చిత్రంలో బాలయ్య పర్ఫార్మెన్స్కు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ జరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన సి.కళ్యాణ్, ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
అంతేగాక బాలయ్య కూడా ఈ కాంబోను మరోసారి రిపీట్ చేసేందుకు సై అన్నాడని తెలుస్తోంది. ఇప్పటికే రెండు సినిమాలతో బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్స్‌ను ఎదుర్కొన్న బాలయ్య, మరోసారి కళ్యాణ్, రవికుమార్ కాంబినేషన్లో సినిమా చేసి మళ్లీ చేతులు కాల్చుకుంటాడా అని ఆయన అభిమానులు భయపడుతున్నారు.