స్టార్ హీరోలకు ప్రాణం పోస్తున్న యాక్టర్!

స్టార్ హీరోల సినిమాలు సూపర్ సక్సెస్ కావాలన్నా.. ప్రేక్షకులు దానికి బ్రహ్మరథం పట్టాలన్నా ఆ సినిమాలో ఏదో ఒక పాత్ర కథను మలుపు తిప్పేలా ఉండాలి. అలాంటి పాత్రలు చేసే నటులను ప్రేక్షకులు చాలా కాలం వరకు గుర్తుకుపెట్టుకుంటారు. ఇక స్టార్ హీరోల సినిమాల్లో అలాంటి పాత్రలు దక్కాలని ఎవరు మాత్రం కోరుకోరు. ఇప్పుడు ఏకంగా రెండు పెద్ద సినిమాల్లో అలాంటి కీలక పాత్రలో నటిస్తున్నాడు ఓ నటుడు.

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన జ్యోతిలక్ష్మీ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన సత్యదేవ్ ఆ తరువాత వరుసబెట్టి సినిమాలు చేస్తూ జనాలను ఇంప్రెస్ చేస్తూ వచ్చాడు. బ్లఫ్ మాస్టర్ సినిమాతో మంచి నటుడిగా ప్రూవ్ చేసుకున్న ఈ యాక్టర్ ఇప్పుడు తెలుగులో ప్రతిష్టా్త్మకంగా తెరకెక్కుతున్న RRR సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. తారక్, చరణ్‌లు హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాలో సత్యదేవ్ పాత్ర సినిమాకు చాలా కీలకమని తెలుస్తోంది. ఇక మహేష్ బాబు నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు చిత్రంలో కూడా సత్యదేవ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో అతడి పాత్ర సినిమాను మలుపు తిప్పనున్నట్లు తెలుస్తోంది.

ఏదేమైనా సినిమా కథను మలుపు తిప్పే ఇలాంటి పాత్రలు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయని తెలుసుకున్న ఈ నటుడు వరుసబెట్టి రెండు బ్యాక్ టు బ్యాక్‌ పెద్ద సినిమాల్లో నటిస్తుండటంతో అతడి పాత్రలు ఎలా ఉంటాయో అని ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. మరి ఈ నటుడు ఆ సినిమాలకు ఎంతవరకు కీలకం కానున్నాడో సినిమాలు రిలీజ్ అయితే కానీ చెప్పలేం.

Leave a comment