ఎవరెన్ని పైకి సర్ది చెప్పుకున్నా నందమూరి ఫ్యాన్స్‌లో రెండు వర్గాలు ఉన్నాయి. ఎంత టీడీపీ, సీనియర్ ఎన్టీఆర్ వీరాభిమానులు ఉన్నా బాలయ్య ఎన్టీఆర్‌ను సైడ్ చేయడం మొదలు పెట్టాక నందమూరి ఫ్యాన్స్‌లో కొందరు బాలయ్యను సపోర్ట్ చేస్తే, మరికొందరు ఎన్టీఆర్‌ను సపోర్ట్ చేయడం మొదలు పెట్టారు. ఇక చంద్రబాబు, బాలయ్య, లోకేష్ అంతా ఓ వర్గంగా ఉంటారు. ఇటు ఎన్టీఆర్ ఎప్పుడూ ఒంటరి పోరే చేస్తూ వస్తున్నారు.
ఏడెనిమిదేళ్లుగా ఎన్టీఆర్‌కు బాబాయ్, మామతో మాటల్లేవ్. మధ్యలో హరికృష్ణ మృతి తర్వాత ఎన్టీఆర్‌తో వీళ్లు సఖ్యతతో ఉన్నట్టు కనిపించినా అది పైపై మెరుగు మాత్రమే అయ్యింది. ఇక అసలే ఉప్పునిప్పుగా ఉంటోన్న ఎన్టీఆర్, బాలయ్య అభిమానుల మధ్య ఇప్పుడు బాలయ్య చిన్నల్లుడు భరత్ చేసిన వ్యాఖ్యలు మరింత మంటపెట్టేలా మారాయి.
జాఫర్ ఇంటర్వ్యూలో భరత్ అసలు జూనియర్ కు రాజకీయాలు ఎందుకు అనే అర్థంవచ్చేలా మాట్లాడారు భరత్. ఒకదశలో ఎన్టీఆర్ మాకు అవసరం లేదని కుండబద్దలుకొట్టారు. ఎన్టీఆర్ వస్తేనే టీడీపీ జవసత్వాలు పుంజుకుంటుందని తాము అనుకోవడం లేదని.. ఇప్పటికే టీడీపీలో ఉన్న నాయకులు సరిపోతారని చెప్పడంతో పాటు పరోక్షంగా అసలు ఎన్టీఆర్ అవసరమే పార్టీకి లేదన్నట్టుగా చాలా లైట్‌గా మాట్లాడాడు.
భరత్ వ్యాఖ్యలతో జూనియర్ ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు. అటు భరత్‌తో పాటు ఇటు లోకేష్‌ను కూడా టార్గెట్‌గా చేసుకుని కామెంట్లు పెడుతున్నారు. ఈ ఇద్దరు తోడళ్లుల్లు ఈ ఎన్నికల్లో ఓడిపోయారు. అటు నందమూరి అభిమానులు కూడా రెండుగా చీలి ఒకరిని ఒకరు టార్గెట్‌గా చేసుకుంటూ సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. మరి భరత్ వ్యాఖ్యలు చివరకు ఎక్కడి వరకు వెళతాయో ? చూడాలి.