యంగ్‌రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సాహో చిత్రం మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని యావత్ ప్రజానీకం ఎంతో ఆతృతగా ఉన్నారు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అయినా క్షణాల్లో మూడు రోజులు బుకింగ్ పూర్తి అయ్యాయి. రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న సినిమా కావడంతో భారీ ఓపెనింగ్స్‌తో పెట్టుబడి దక్కించుకునేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే సాహో నిర్మాతలకు ఏపీ ప్రభుత్వం ఊరట కల్పించింది.సాహో` నిర్మాతలు అదనపు షోల కోసం ప్రభుత్వ అధికారుల్ని అభ్యర్థించారని తెలుస్తోంది. అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకి కావాల్సిన అనుమతులు ప్రభుత్వం నుంచి ఉదారంగా లభించాయి. రెగ్యులర్‌గా వేసుకునే నాలుగు షోలే కాకుండా మరో రెండు అదనపు షోలకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది.
సినిమా రిలీజ్ అవుతోన్న 30 ఆగస్టు నుంచి 5 సెప్టెంబర్ వరకూ రోజుకు ఆరు షోలు ప్రదర్శించనున్నారు. అంటే 24/7 షోలు ఒకదాని వెంట ఒకటిగా పడుతూనే ఉంటాయన్నమాట. ఇక గురువారం అర్ధరాత్రి నుంచే ప్రీమియర్లు వేసుకున్నా పట్టించుకునే వారు ఉండరు. తెలంగాణలో అదనపు షోల సంగతి కాసేపు పక్కన పెడితే గురువారం అర్థరాత్రి ప్రీమియర్ షోలు వేసుకునేందుకు కూడా పర్మిషన్లు ఇవ్వలేదని తెలుస్తోంది.
తెలంగాణలో గత ఐదేళ్లలోనూ కేసీఆర్ సర్కార్ భద్రతా కారణాల దృష్ట్యా ప్రీమియర్లకు అనుమతులు ఇవ్వలేదు. ఇక బాహుబలి 2 లాంటి సినిమాలకు మాత్రం ముందు రోజు రెండో షోనే వేసుకోక తప్పలేదు. మరి ఇప్పుడు సాహోకు కూడా అనుమతులు రాకపోతే అది మేకర్స్‌కు షాకే అనుకోవాలి. అదే జరిగితే గురువారం ఎంపిక చేసిన కొన్ని థియేటర్లలో రెండో షో నుంచే అక్కడ సాహో ప్రారంభమవుతుంది.