టాలీవుడ్ లో గత కొన్ని సంవత్సరాలుగా టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఓ వెలుగు వెలిగిన రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ వెలుగులు క్రమక్రమంగా తగ్గుతున్నాయి. ప్రస్తుతం దేవికి అవకాశాలు ఇచ్చేందుకు స్టార్ హీరోలు సైతం వెనుకంజ వేస్తున్నారంటే ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం అవుననే ఆన్సర్లు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు దేవి మ్యూజిక్ అంటే కేవలం తెలుగు ప్రేక్షకులే కాదు కన్నడ స్టార్ హీరోలు, తమిళ స్టార్ హీరోలు సైతం చెవికోసుకునే వారు. సూర్య లాంటి కోలీవుడ్ స్టార్ హీరో సైతం తన సింగం సిరీస్ సినిమాలకు మ్యూజిక్ ఇప్పించుకున్నాడు.
ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోలకు దేవిశ్రీ మాత్రమే ఆప్షన్ గా ఉండేవారు. ఆ తర్వాత థమన్ వచ్చినా ఎక్కువ మంది మాత్రం దేవీ వైపే మొగ్గు చెబుతూ వచ్చారు. ఇక ఇప్పుడు తెలుగులో మీడియం రేంజ్ హీరోల నుంచి స్టార్ హీరోల వరకు ప్రతి ఒక్కరు కొత్తదనం కోసం నాన్ తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న భారీ బడ్జెట్ సినిమాలు చూస్తే సైరా – సాహో – ప్రభాస్ జాన్ – బాలయ్య రూలర్ – రణరంగం – గ్యాంగ్ లీడర్ – నాని వి – అర్జున్ సురవరం ఇలాంటి సినిమాలకు ఇతర భాషా మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ అందిస్తున్నారు.
బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది – కోలీవుడ్ డైరెక్టర్ జిబ్రాన్ – మరో బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ చిరంతన్ భట్ – కోలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ – ప్రశాంత్ పిళ్లూ – మలయాళం మ్యూజిక్ డైరెక్టర్ గోపీసుందర్ ఇలా ఇతర భాషలకు చెందిన మ్యూజిక్ డైరెక్టర్ల ఆధిపత్యమే ప్రస్తుతం టాలీవుడ్ లో కొనసాగుతోంది. దేవీ ప్రతి సినిమాకు చాలా టైం తీసుకోవడం, మ్యూజిక్ ఇచ్చే విషయంలో పెట్టే కండీషన్లు, మితిమీరిన ఓవర్ కాన్ఫిడెన్స్, రొటీన్ మ్యూజిక్ చాలా మందికి నచ్చడం లేదట. అందుకే ఇప్పుడు దేవిని చాలా మంది పక్కన పెట్టేస్తున్నారని అంటున్నారు.